ఖర్జూరం. అందరూ ఎక్కువగా ఇష్టపడతారు. ఖర్జూరాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొందరికి ఖర్జూరాలను నేరుగా తింటే సరిగ్గా జీర్ణం కావు.
అలాంటి వారు ఖర్జూరాలను నానబెట్టి తింటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఖర్జూరాలను నేరుగా తినడం కంటే నానబెట్టి తింటే ఎక్కువ లాభం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాలను 3 లేదా 4 తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. వాటిని మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినాలి. ఇలా రోజూ తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
ఖర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ వంటి సహజసిద్ధమైన చక్కెరలు అధికంగా ఉంటాయి. కనుక ఉదయం వీటిని తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట ఉండవు. బద్దకం పోతుంది. ఖర్జూరాలను తినడం వల్ల వాటిల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది. నానబెట్టిన ఖర్జూరాలు ప్రీబయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. ఖర్జూరాలలో ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. కనుక వీటిని రోజూ తింటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి నానబెట్టిన ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. గుండె పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
అదే విధంగ ఖర్జూరా తీసుకోవటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరాల్లో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరాల్లోని సహజసిద్ధమైన చక్కెరలు మెదడుకు కావల్సిన శక్తిని అందిస్తాయి. దీని వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా చూస్తాయి. దీని వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరాల్లో ఎముకల ఆరోగ్యానికి అవసరం అయిన క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక ఖర్జూరాలను రోజూ తింటే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. నానబెట్టిన ఖర్జూరాలను తింటే లివర్, కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. ఆయా అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
































