అమరావతిలో అద్భుతం.. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ ఈవెంట్‌

www.mannamweb.com


అమరావతిలో భారీ డ్రోన్ షో జరగబోతోంది. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ ఈవెంట్‌గా ఇది చరిత్ర పుటల్లో నిలవబోతుంది. 5 వేలకు పైగా డ్రోన్లతో అతి భారీ షో నిర్వహిస్తున్నారు.

9 థీమ్స్‌ మీద కార్యక్రమాలు ఉండనున్నాయి. 1800మంది డెలిగేట్స్‌ హాజరవ్వనున్నారు. ఈనెల 22, 23 తేదీల్లో అమరావతిలో డ్రోన్‌ హ్యాకథాన్‌ జరగనుంది. భవిష్యత్తులో అనేక రంగాల్లో డ్రోన్ల సేవలు వినియోగిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. డ్రోన్లకు సంబంధించి రీసెర్చ్.. తయారీ.. ఇన్నోవేషన్ కోసం సీఎం చంద్రబాబు ఓ పాలసీ తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచడం కోసం భారీ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. దేశంలో ఇలాంటి షో తొలిసారి జరుగుతోంది. ఈ షో లో అనేక డ్రోన్ కంపెనీలతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు, డ్రోన్ ఆపరేటర్లు పాల్గొంటారు.

అసలు ఈ డ్రోన్ల వల్ల ఉపయోగాలేంటి అంటే….చాలానే ఉన్నాయి. ప్రస్తుతం డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మొన్నటి విజయవాడ వరదల సందర్భంలోనూ సహాయక చర్యల్లో డ్రోన్లను వినియోగించారు. సహాయక బృందాలు సైతం చేరుకోలేని పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, మందులు సహా అనేక రకాలుగా సహాయం అందించారు. వరదల తర్వాత కూడా డ్రోన్లను ఉపయోగించి సేవలు అందించారు. అలాగే వ్యవసాయ రంగంలో డ్రోన్లను పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో, మారుమూల ప్రాంతాలకు అత్యవసరంగా మెడిసిన్‌ అందించాలంటే డ్రోన్ల మీదే ఆధార పడాల్సి వస్తోంది. లేటెస్టుగా చెన్నైలో వరదల సందర్భంగా పరిస్థితిని సమీక్షించడానికి, ముంపు తీవ్రతలను తెలుసుకోవడానికి కూడా డ్రోన్ల మీదే ఆధార పడాల్సి వస్తోంది.

డ్రోన్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.