అమెజాన్‌ ప్రైమ్‌ vs ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్‌షిప్.. దేంట్లో ఏ బెనిఫిట్స్‌?

పండగ సీజన్‌కు ఇ-కామర్స్‌ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రతియేడులానే ఈసారి కూడా అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్స్‌, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్స్‌ పేరుతో ముందుకురానున్నాయి. ఇలాంటి సమయాల్లో ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు ఒకరోజు ముందుగానే సేల్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంటుంది. ఈక్రమంలోనే అమెజాన్‌ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవల బ్లాక్‌ మెంబర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. మరి ఈ రెండు సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్లలో దేంట్లో ఏమేం ప్రయోజనాలు లభిస్తాయో చూద్దాం.


సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ ధర

  • అమెజాన్‌ ప్రైమ్‌కు యూజర్లు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ అయితే రూ.299, త్రైమాసికానికి రూ.599, ఏడాదికి రూ.1,499 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రైమ్‌లైట్‌ ధర రూ.799, రూ.399కి ప్రైమ్‌ షాపింగ్‌ ఎడిషన్‌ అందుబాటులో ఉన్నాయి.
  • ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్‌షిప్‌ కేవలం ఏడాది ప్లాన్‌ కింద మాత్రమే లభిస్తోంది. వాస్తవానికి దీని ధర రూ.1,499 కాగా.. ఈనెలాఖరు వరకు రూ.990కే అందుబాటులో ఉంటుంది. ఒకసారి సబ్‌స్క్రిప్షన్‌ కొనుగోలు తీసుకున్నాక రీఫండ్‌ ఆప్షన్‌ ఉండదు.

షాపింగ్‌.. డీల్స్‌..

  • అమెజాన్‌ ప్రైమ్‌ ప్రధానంగా ఫాస్ట్‌ డెలివరీపై దృష్టిపెడుతుంది. ఫ్రీ వన్‌డే, సేమ్‌ డే డెలివరీలు, ప్రత్యేక ప్రైమ్‌ డే ఆఫర్లు, లైటినింగ్‌ డీల్స్‌తో పాటు సేల్‌ సమయంలో ప్రైమ్‌ మెంబర్లకు ముందుగా యాక్సెస్‌ లభిస్తుంది.
  • ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మాత్రం క్యాష్‌బ్యాక్‌, రివార్డ్‌లపై దృష్టిపెడుతోంది. ప్రతి కొనుగోలుపై 5 శాతం సూపర్‌కాయిన్స్‌ క్యాష్‌బ్యాక్‌ (నెలకు గరిష్ఠంగా 800 సూపర్‌కాయిన్స్‌ వరకు) అందిస్తోంది. అదనంగా బ్లాక్‌ డీల్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రీమియం ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లు, బ్లాక్‌ మెంబర్లకు ముందుగా యాక్సెస్‌ వంటివి అందిస్తోంది. ముఖ్యంగా క్లియర్‌ట్రిప్‌, ఫ్లిప్‌కార్ట్‌ ట్రావెల్ ద్వారా విమాన టికెట్ల రద్దు లేదా రీషెడ్యూల్‌ను కేవలం రూ.1కే చేసుకొనే సదుపాయం కల్పిస్తోంది.

వినోదం

  • అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌లో షాపింగ్‌ ప్రయోజనాలతోపాటు ప్రైమ్‌ వీడియో ఉచితంగా లభిస్తుంది. ఇందులో భారతీయ, అంతర్జాతీయ కంటెంట్‌, ప్రైమ్‌ మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌ (ఇ-బుక్స్, మ్యాగజైన్లు), ప్రైమ్‌ గేమింగ్‌ వంటి లభిస్తాయి.
  • ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్‌షిప్‌లో ఏడాది పాటు రూ.1,490 విలువ గల యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. దీంతో యూట్యూబ్‌ను యాడ్స్‌ లేకుండా వీక్షించొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ ప్లే ఆప్షన్‌ ద్వారా ఆడియో మాత్రమే వినొచ్చు. ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్లు, యూట్యూబ్‌ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.