అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్: ఫెస్టివల్ సేల్స్‌తో బంపర్ ఆఫర్లు

పండగ సీజన్‌ దగ్గరపడుతుండడంతో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారుల కోసం భారీ ఆఫర్లు ప్రకటించాయి.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025తో పాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 త్వరలో ప్రారంభం కానున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలు, స్మార్ట్ హోమ్ డివైస్‌లు ఇలా అన్ని విభాగాల్లోనూ రాయితీలు అందించనున్నారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025

అమెజాన్ తన ఫెస్టివల్ సేల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే కచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించలేదు. సేల్‌లో యాపిల్, శాంసంగ్, ఐకూ, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు 40 శాతం వరకు డిస్కౌంట్‌తో లభించనున్నాయి. హెచ్‌పీ, శాంసంగ్, సోనీ, బోట్ ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు రాయితీలు ఉంటాయి. గృహోపకరణాలు (ఎల్‌జీ, శాంసంగ్, హైయర్, గోద్రెజ్)పై 65 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు. అలాగే సోనీ, శాంసంగ్, ఎల్జీ, షావోమీ స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు 65 శాతం వరకు తక్కువ ధరలకు లభిస్తాయి. అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవీ, కిండిల్ ఇ-రీడర్స్ వంటి స్మార్ట్ హోమ్ డివైస్‌లను 50 శాతం వరకు డిస్కౌంట్‌తో అందించనుంది. విమాన టికెట్లపై కూడా 65 శాతం వరకు ఆఫర్లు ఉంటాయి.

ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ రాయితీ లభించనుంది. అమెజాన్ పే లేటర్ వినియోగదారులకు రూ.600 రివార్డ్స్, అమెజాన్ పే వాలెట్ ట్రాన్సాక్షన్స్‌పై రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఈ సేల్‌కు 24 గంటల ముందే యాక్సెస్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025

ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో టీజర్‌ను విడుదల చేసింది. అయితే సేల్ తేదీని ఇంకా వెల్లడించలేదు. గతేడాది సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఈ సేల్ ఈసారి కూడా అదే సమయంలో రావచ్చని అంచనా. ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24, వన్‌ప్లస్ బడ్స్ 3, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో వంటి హాట్ ప్రొడక్ట్స్‌పై ప్రత్యేక రాయితీలు ప్రకటించనుంది. అదనంగా ఇంటెల్ పీసీలు, 55 అంగుళాల స్మార్ట్ టీవీలు, ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు కూడా తక్కువ ధరలకు లభించనున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్యాంక్‌ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్‌లపై 10శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ ఈఎంఐ, యూపీఐ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, పే లేటర్ సర్వీసులు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు సూపర్‌కాయిన్స్ ఆఫర్లు కూడా ఉంటాయి.

ఏది బెస్ట్‌?

రెండు ప్లాట్‌ఫాంలు కూడా బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌, పే లేటర్, క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ S24పై ప్రత్యేక దృష్టి పెట్టగా.. అమెజాన్ గృహోపకరణాలు, ట్రావెల్ టికెట్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. మొత్తానికి ఈ ఫెస్టివల్ సీజన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మధ్య వినియోగదారుల కోసం గట్టి పోటీ నెలకొననుంది. దేన్ని ఎంచుకోవాలన్నది కస్టమర్ల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.