ఇక నిత్యావసరాలను డెలివరీ చేయనున్న అమెజాన్

www.mannamweb.com


అమెజాన్ కూడా తన క్విక్ కామర్స్ సర్వీస్‌ను భారత్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అమెజాన్ క్విక్ కామర్స్ సేవలు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని అంటున్నారు. దీంతో బ్లింకిట్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి సంస్థలకు పోటీగా అమెజాన్ రానుంది.

ఈ-కామర్స్ కంపెనీల్లో వేగవంతమైన వస్తువులను డెలివరీ చేయడానికి చాలా పోటీ ఉంది. బ్లింకిట్ 10 నిమిషాల్లో వస్తువులను డెలివరీ చేస్తుందని చెబుతుండగా, ఫిప్‌కార్ట్ కూడా తన ‘మినిట్స్’ సర్వీస్‌తో 10-15 నిమిషాల్లో కస్టమర్లకు వస్తువులను డెలివరీ చేస్తోంది. ఇప్పుడు అమెజాన్ కూడా నిత్యావసరాలను సాధ్యమైనంత వేగంగా అందించే(క్విక్ కామర్స్) సర్వీస్‌ను భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు మెుదలుపెట్టింది. అమెజాన్ క్విక్ కామర్స్ సేవలు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని అంచనా.

అమెజాన్ క్విక్ కామర్స్

భారతదేశంలో క్విక్ కామర్స్ సేవను ప్రారంభించడానికి, వ్యూహరచన చేయడానికి అమెజాన్ ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నియమించుకుందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ కంపెనీ క్విక్ సర్వీస్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్‌ స్విగ్గీలో వాటా కొనుగోలుకు అమెజాన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెజాన్ అంతర్గతంగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోందని కొందరు చెబుతున్నారు.

మరోవైపు అమెజాన్ ఇండియా హెడ్ మనీష్ తివారీ ప్రస్తుతం తన నోటీసు పిరియడ్‌లో ఉన్నారు. తివారీ అక్టోబర్‌లో అమెజాన్‌ను వీడనున్నారు. అమెజాన్ ఇండియాలో పీసీ, ఆడియో, కెమెరా, లార్జ్ అప్లయెన్సెస్ వ్యాపారాన్ని చూసుకుంటున్న నిశాంత్ సర్దానాకు క్విక్ కామర్స్ బిజినెస్ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రంజీత్ బాబు ఇకపై కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయెన్సెస్, వైర్‌లెస్‌తోపాటు ఇతర వాటికి నేతృత్వం వహించనున్నారు. అయితే ఈ ఊహాగానాలపై కంపెనీ స్పందించలేదని అమెజాన్ ఇండియా ప్రతినిధి ఒకరు ఈటీకి తెలిపారు.
ఈ కామర్స్ వృద్ధి

ఇంకోవైపు ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే తన క్విక్ కామర్స్ సర్వీస్ మినిట్స్‌ను బెంగళూరులో ప్రారంభించింది. న్యూఢిల్లీ, ముంబైలలో కూడా అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారత ఈ-కామర్స్ మార్కెట్ విలువపరంగా 18-20 శాతం వృద్ధి చెందిందని, కిరాణా అమ్మకాలు 38 శాతం పైగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా క్విక్ కామర్స్‌లో గణనీయమైన పెరుగుదల దీనికి కారణమని అంచనాలు చెబుతున్నాయి.

భవిష్యత్తులో పెరిగే అవకాశం

2025 నాటికి భారత క్విక్ కామర్స్ మార్కెట్ విలువ 6 బిలియన్ డాలర్లు ఉంటుందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆన్‌లైన్ కిరాణా అమ్మకాల్లో 40 శాతం క్విక్ కామర్స్ నుండి వస్తున్నాయి. 2021-23లో ఈ విభాగం 230 శాతం వృద్ధి చెందగా.. బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి టాప్ 3 కంపెనీలు ముందున్నాయి.