ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులతో దేశంలోనే అగ్రస్ధాయి సంస్థలు క్యూ కడుతున్నాయి.
ఇందులో భాగంగా తాజాగా పలు ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇవన్నీ చూస్తూ ఇప్పుడు ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కూడా ఓ కీలక ప్రాజెక్టుతో కర్నూలుకు గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు వీలుగా గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో పాతికేళ్ల పాటు అమల్లో ఉండే ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా అన్నట్లుగా చంద్రబాబు సర్కార్ కూడా రిలయన్స్ నూ సన్ టెక్ సంస్థతో మరో కీలక ఒప్పందం చేసుకునేందుకు సిద్దమవుతోంది. ఇది అమల్లోకి వస్తే కర్నూలులో ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు రావడం ఖాయం.
రిలయన్స్ నూ సన్ టెక్ సంస్థ ప్రతిపాదిస్తున్న ప్రకారం కర్నూలులో 10 వేల కోట్ల పెట్టుబడితో రెండు సౌర విద్యుత్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇందులో ఒకటి 930 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కాగా.. మరొకటి 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద సోలార్ యూనిట్ గా ఈ ప్రాజెక్టు పేరు తెచ్చుకోనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కలిసి రిలయన్స్ నూ సన్ టెక్ ఈ ప్రాజెక్టులు చేపట్టబోతోంది. 24 నెలల్లో ఈ ప్రాజెక్టు ప్రారంభించి 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసేలా త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముంది. అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి కూడా దొరికే అవకాశాలున్నాయి.