విజయవాడ నగరం నడిబొడ్డున సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభించిన 206 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహ నిర్వహణ భారంగా మారిందని వివిధ ప్రభుత్వ శాఖలు చేతులెత్తేస్తున్నాయి.
ప్రతి నెల రూ.21లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో విగ్రహ నిర్వహణ భారాన్ని వదిలించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
అంబేడ్కర్ సామాజిక న్యాయ శిల్పం పేరుతో ఈ ఏడాది జనవరిలో విజయవాడలో 206 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. నగరం మధ్యలో ఉన్న పిడబ్ల్యూడి గ్రౌండ్స్‌లో 125 అడుగుల విగ్రహాన్ని 80 అడుగుల ఎత్తైన పీఠంపై ఏర్పాటు చేశారు.
19ఎకరాల స్వరాజ్యమైదానంలో భారీ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా రాజకీయంగా లబ్ది కలుగుతుందని వైసీపీ భావించింది. రూ.200కోట్ల అంచనాలతో చేపట్టిన పనులు చివరకు రూ.400కోట్లకు పెరిగిపోయాయి. తెలంగాణలో అందులో సగం ఖర్చుతోనే అన్ని పనుల్ని పూర్తి చేశారు. ఏపీలో ఖర్చు అంచనాలను మించిపోయినా ఇంకా పనులు మాత్రం పూర్తి కాలేదు. కొందరు ఐఏఎస్ అధికారులు విగ్రహ నిర్మాణంలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నా దానిపై ఎలాంటి విచారణ చేయలేదు.
అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు స్మృతివనం నిర్వహణకు ప్రతి నెల రూ.21లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత డబ్బును వెచ్చించడం తమకు భారం అవుతోందని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం భావిస్తున్నాయి. విగ్రహ సందర్శన, ఎంట్రీల కోసం వసూలు చేస్తున్న ఫీజులతో నెలకు రూ.ఐదారు లక్షలు కూడా ఆదాయం రావడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టును ఎలా వదిలించుకోవాలనే యోచనలో ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. దీనికి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించాలని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఉంది.
అంబేడ్కర్ సామాజిక న్యాయ శిల్పం ఉన్న ప్రాంగణాన్ని ఆదాయం వచ్చేలా తీర్చదిద్దాలనే ఆలోచన ఉన్నా దానిపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో స్పష్టత కొరవడింది. ఇటీవల ఈ ప్రాంగణంలో అనధికారిక ప్రదర్శన ఏర్పాటు చేయడంతో అంబేడ్కర్ విగ్రహంపై ఈ రగడ మొదలైంది.
ఆదాయం కోల్పోవడంతోనే…
అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించిన ఇరిగేషన్ శాఖకు చెందిన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌ను స్వరాజ్య మైదాన్‌గా గుర్తింపు ఉంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి నగరంలో సువిశాలమైన ప్రాంగణానికి గుర్తింపు ఉంది. ఈ ప్రాంగణానికి ఘనమైన చరిత్ర ఉంది. విజయవాడ నగరంలో మధ్యలో విగ్రహ ఏర్పాటు ద్వారా ఓటర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో నగరం మధ్యలో విగ్రహ ప్రతిష్టాపన చేసినా అది ఫలించలేదు. విగ్రహ నిర్మాణానికి ముందు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో క్రమం ప్రైవేట్ ఎగ్జిబిషన్లు నడిచేవి.
ఈ ప్రాంగణం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ చేతిలోకి వచ్చాక కొందరు ఆదాయం కోల్పోయారు. ఇటీవల విగ్రహ ప్రాంగణంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడంతో రగడ మొదలైంది. ఓ వైపు ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదంటూనే ప్రైవేట్ ప్రదర్శనలు ఏర్పాటు చేయడంపై ప్రత్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. జిల్లా యంత్రాంగం, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వాకంతో ఈ రగడ మొదలైనట్టు తెలుస్తోంది.
ఆదాయం ఆర్జించే అవకాశాలు పుష్కలం..
విజయవాడ నగరం మధ్యలో సువిశాలమైన స్థలంతో పాటు పార్కింగ్ సదుపాయాలతో ఉన్న ప్రాంగణాన్ని విదేశీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు అవసరమైన డిజైన్లను కూడా రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు కోట్లాది రుపాయల్ని ప్రైవేట్ హోటళ్లకు చెల్లిస్తున్నారు. విజయవాడలో నిర్మిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వానికి ఖర్చు కలిసొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రైవేట్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు కమిషన్ల ప్రాతిపదికన పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించడానికి ఏపీ ప్రభుత్వ శాఖలు అలవాటు పడిపోయాయి.
అంబేడ్కర్ పార్క్‌లో ఆడిటోరియం, మ్యూజియం, కాన్ఫరెన్స్ హాళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించడం లేదు. ఈ హాళ్లను ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు అంబేడ్కర్ పార్క్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంపై ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో రూ.400కోట్లతో నిర్మించిన పార్క్ నిర్వహణను ప్రైవేట్ వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.