Ammaku Vandanam: ‘అమ్మ ఒడి’ స్థానంలో ‘అమ్మకు వందనం’.. ఆధార్‌ కార్డు లేకపోయినా ఓకేనట!

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం.. కూటమి సర్కార్ హయాంలో ‘అమ్మకు వందనం’గా రూపుదాల్చింది.

ఈ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొంది. ఒకవేళ లేకపోతే ఆధార్‌ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆధార్‌ వచ్చే వరకూ.. మొత్తం 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

అమ్మకు వందనం పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షణ చేపట్టేవారికి ఏడాదికి రూ. 15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు సంబంధిత పాఠశాలలో తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదివే పిల్లలకు అందించే ‘స్టూడెంట్‌ కిట్‌’లలో విద్యార్థులకు బ్యాగ్, మూడు జతల యూనీఫాం, బెల్టు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ బుక్‌లు, ఆంగ్ల నిఘంటువు ఇవ్వనున్నట్లు తెలిపారు.

‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ పథకాల కింద ప్రయోజనం పొందేందుకు తప్పనిసరిగా ఆధార్‌ కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఒకవేళ ఎవరికైనా ఆధార్‌ లేకపోతే.. విద్యాశాఖ ద్వారా ఆధార్‌ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ఆధార్‌ వచ్చేంత వరకు ఓటరు ఐడీ, ఉపాధి పథకం కార్డు, కిసాన్‌ పాస్‌బుక్, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌ బుక్‌ లేదంటే తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్‌ లైసెన్సు, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన పత్రాలు, తహసీల్దారు ఇచ్చే పత్రం, గుర్తింపును సూచించే ఏ విధమైన పత్రాన్నైనా అనుమతిస్తారని ఆయన వెల్లడించారు.