తమిళనాట ఇనుప యుగం నాటి ఈటె లభ్యం

తమిళనాడులోని తెన్‌కాశి సమీపం తిరుమలపురం వద్ద చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో ప్రాచీన ఇనుప యుగం నాటి అత్యంత పొడవైన ఈటె బయల్పడింది.


8 అడుగుల పొడవైన ఈ ఈటె క్రీస్తుపూర్వం 3345 సంవత్సరాల నాటిదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాటు 6.5 అడుగుల పొడవున్న మరో ఈటె, పలు ఇనుప పనిముట్లు, కుండలు, సమాధి పాత్రలు, ఇతర కళాఖండాలు వెలుగు చూశాయి. ప్రాచీన ఇనుపయుగం తమిళనాటే ప్రారంభమైందనే వాదనలకు ఈ వస్తువులు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈటె ఒక చివర కొద్దిగా గుండ్రంగా ఉందని, వాడుక సౌలభ్యం కోసం ఇలా తయారు చేసి ఉంటారని పురావస్తు పరిశోధకుడు కే వసంత్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. తవ్వకాల్లో బయల్పడిన ఇనుప పనిముట్లను బట్టి ఈ ప్రాంతంలో క్రీ.పూ.2500 నుంచి క్రీ.పూ.3000 మధ్యకాలం నాటి ప్రజలు ఇనుము వాడక పరిజ్ఞానం కలిగి ఉండేవారని మరోపరిశోధకుడు రాజన్‌ తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.