ఏపీలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు.. టోకెన్ తీసుకుని భోజనం చేసిన చంద్రబాబు దంపతులు

www.mannamweb.com


గుడివాడ మునిసిపల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. స్వయంగా ముఖ్యమంత్రి దంపతులు భోజనాన్ని వడ్డించారు. ఆ తర్వాత టోకెన్ తీసుకుని మరీ అక్కడే భోజనం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. స్థానిక ప్రజలతో మమేకం అవుతూ.. అన్న క్యాంటీన్‌పై సామాన్యుల అభిప్రాయాలు సేకరించారు. అన్న క్యాంటీన్‌లో భోజనం చేయడం ఎలా అనిపిస్తుందని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. చిన్న చిన్న పనులు చేసుకుంటున్న పలువురు.. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ల సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో.. అవన్నీ చేయాలంటూ కలెక్టర్‌కి ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.

ఎన్టీఆర్ పుట్టిన గడ్డ.. ఆయనను ఎమ్మెల్యేను చేసిన ప్రాంతమైన గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. గుడివాడకు టీడీపీ ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. పేదలకు కడుపునిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సేవాభావంతో ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి.. పేదల కడుపు నింపడంలో మీ వంతు పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

2014 నుంచి 2019 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సర్కార్ ఏర్పాటవటంతో అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం అవుతున్నాయి. తొలిదశలో భాగంగా 100 క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో మొదటిది గుడివాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మిగిలిన వాటిని ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించనున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్లలో 15 రూపాయలకే మూడు పూటలా ప్రభుత్వం భోజనం పెడుతుంది. మూడు పూటలా కలిపి రోజూ లక్ష మందికి పైగా భోజనం చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.