నేషనల్ హైవే, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వార్షిక టోల్ పాస్‌ను (Annual toll pass) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
దీని ద్వారా ప్రయాణికులకు ఖర్చు తగ్గించటంతో పాటు టోల్ చెల్లింపుల వ్యవస్థ మరింత సౌకర్యవంతంగా మారనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాసు అమల్లోకి వచ్చింది. అయితే, కేవలం వైట్ నంబర్ ప్లేట్ వెహికల్స్‌కు మాత్రమే ఈ యాన్యువల్ పాస్ వర్తిస్తుంది. ఇక రూ.3000 చెల్లించి రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంతో ఏడాది పాటు లేదా 200 టోల్ గేట్ల వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. ఇక ఎన్‌హెచ్ఏఐ ప్రవేశపెట్టిన ఈ వార్షిక ఫాస్టాగ్‌కు తొలి రోజే భారీ స్పందన లభించింది. కేవలం ఒక్క రోజులోనే 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ ప్యాకేజీని కొనుగోలు చేయగా, 1.39 లక్షల లావాదేవీలు నమోదయినట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
* రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI వెబ్‌సైట్ (https://fastag.ihmcl.com/) నుంచి కొనుగోలు చేయవచ్చు.
* యాప్/వెబ్ సైట్ ఓపెన్ చేశాక, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
* వార్షిక పాసు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* వెహికల్ నంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ మోడల్‌లోకి వెళ్తుంది.
* యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలి.
* పేమెంట్ పూర్తి అయిన రెండు గంటల తర్వాత పాస్ యాక్టివేట్ అవుతుంది.
* డాక్యుమెంట్లు అన్ని సరైనవి ఉంటేనే పాస్ యాక్టివేట్ అవుతుందని గుర్తుంచుకోవాలి.
* అలాగే, నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై మాత్రమే ఈ పాసు పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా మున్సిపల్ సంస్థలు నిర్వహించే రాష్ట్ర హైవేలు లేదా టోల్ రోడ్లపై ఈ పాసు చెల్లదు.
































