ఏపీలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న లేఅవుట్ల క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఇచ్చిన గడువు ఈ నెల 23తో ముగిసింది.
ఈ నేపథ్యంలో దీన్ని పొడిగించాలని కోరుతూ ప్రభుత్వానికి పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రంలో అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న లేఅవుట్ల క్రమబద్ధీకరణకు మరో మూడు నెలలు గడువు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ఇవాళ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 23తో ముగిసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ గడువును అక్కడి నుంచి మూడు నెలలు అంటే జనవరి 23న వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకూ వివిధ కారణాలతో లే అవుట్ల క్రమబద్ధీకరణ చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ గడువును మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో జనవరి 23 వరకూ లే అవుట్లు,ప్లాట్ లు రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇతరత్రా ఇబ్బందుల కారణంగా ఈ క్రమబద్ధీకరణలు చేసుకోని వారు నిర్ణీత ఫీజు చెల్లించి వాటిని పూర్తి చేసుకునేందుకు వీలు కలుగుతోంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వా ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తోంది. పెద్ద ఎత్తున చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఉండటంతో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆదాయార్జనకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇలా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు కూడా అవకాశం కల్పించి ఆదాయం పెంచుకోవాలని చూస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే లేఅవుట్ దారులు మాత్రం ప్రభుత్వం డెడ్ లైన్ పొడిగింపుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
































