ఏపీలో మరో ‘మహా’ నగరం

 ఏపీలో( Andhra Pradesh) మరో గ్రేటర్ సిటీ తెరపైకి వచ్చింది. గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.


దీంతో నగర పరిధి మరింత పెరగనుంది. ఇప్పటివరకు 30.17 చదరపు కిలోమీటర్లు ఉండగా.. ఇకనుంచి 283.80 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుపతి మహానగర పాలక సంస్థగా మారనుంది. గ్రేటర్ తిరుపతిలో తిరుపతి గ్రామీణ మండలం విలీనం కానుంది. చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని 63 గ్రామపంచాయతీలను విలీనం చేయాలని జిల్లా యంత్రాంగం ఈ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు తిరుపతి గ్రేటర్ తీర్మానాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతున్నట్లు మేయర్ డాక్టర్ శిరీష ప్రకటించారు.

* ఇప్పటివరకు విశాఖ మాత్రమే..
ఇప్పటివరకు ఏపీలో విశాఖ నగరపాలక సంస్థకు( greater Visakha Municipal Corporation) గ్రేటర్ హోదా ఉంది. ఇప్పుడు తిరుపతి కూడా గ్రేటర్ గా మారనుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్లో కౌన్సిల్ సమావేశం జరిగింది. 108 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం లభించింది. ఈ విస్తరణతో తిరుపతి నగరం మరింత విస్తరించనుంది. ఇటీవల సీఎం చంద్రబాబు తిరుపతి నగరంలో పర్యటించారు. నగరాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అప్పట్లోనే గ్రేటర్ ప్రతిపాదన వచ్చింది. విలీన పంచాయితీలకు సంబంధించి యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

* ఎమ్మెల్యే కీలక సూచనలు..
గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కీలక సూచనలు చేశారు. చంద్రగిరి తో( Chandragiri) పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకొని మరిన్ని పంచాయతీలను విలీనం చేయాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు అభ్యంతరాలు తెలిపారు. కానీ ఎమ్మెల్యేలతో పాటు కో ఆప్షన్ సభ్యులు ఎక్కువమంది గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వడంతో ఆమోదం తెలిపినట్లు మేయర్ శిరీష ప్రకటించారు.

* పెరగనున్న నగర విస్తీర్ణం..
ప్రస్తుతం తిరుపతి నగరం 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. గ్రేటర్ గా మారితే మాత్రం 284 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. జనాభా సంఖ్య నాలుగు పాయింట్ 50 లక్షల నుంచి.. 7.50 లక్షలకు పెరుగుతుంది. వార్షిక ఆదాయం రూ.149 కోట్ల నుంచి రూ.182 కోట్లకు చేరుకోనుంది. చంద్రగిరి తో పాటు రేణిగుంట పెద్ద పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. ఆ రెండు గ్రేటర్ తిరుపతిలో కలవనున్నాయి. ఇకనుంచి నగరం విమానాశ్రయం నుంచి వికృతమాల వరకు విస్తరించనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.