ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలన్న టార్గెట్ తో కూటమి సర్కారు దూసుకుపోతుంది. ఈ మేరకు పెట్టుబడులను ఆకర్షించడంలో మరో కీలక ముందడుగు పడింది.
విశాఖ వేదికగా మరో దిగ్గజ ఐటీ సంస్థ భారీ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ కీలక ఒప్పందం ద్వారా రానున్న ఐదేళ్లలో 10,000 మందికి పైగా నాణ్యమైన ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీంతో ఈ విషయం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్…
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఏఎన్ఎస్ఆర్ సంస్థ విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ క్లస్టర్‌లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఏఎన్ఎస్ఆర్ సంస్థ సీఈఓ లలిత్ అహూజా మాట్లాడుతూ… ప్రపంచ స్థాయి ప్రతిభ, మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం వంటివి విశాఖలో మేళవించి ఉన్నాయని కొనియాడారు. తమ ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలకు విశాఖను ఒక ప్రధాన గమ్యస్థానంగా మారుస్తుందని తెలిపారు.
అలానే మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం ఐటీ, జీసీసీ రంగాల్లోనే 5 లక్షల ఉద్యోగాలు అందించనున్నట్టు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో జీసీసీల పాత్ర అత్యంత కీలకమని.. అందుకే వాటిని వ్యూహాత్మక హబ్‌లుగా మార్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలకు ఎకరా 99 పైసలకే భూములు కేటాయించామని చెప్పారు మంత్రి. త్వరలోనే దేశంలోని టాప్-100 ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించాలనే డీఏయనతో పని చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలను ఇవ్వాలనే టార్గెట్ లో.. 12 శాతం నెరవేరిందని అన్నారు. గూగుల్ సంస్థ తమ అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తోందని గుర్తు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో విశాఖకు ప్రపంచ స్థాయి కనెక్టివిటీ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
































