సీజన్‌లో నిండుగా..సిటీలో పండు’గ’! జ్యూస్‌, ఐస్‌క్రీమ్స్‌, స్వీట్స్‌ నుంచి..

మామిడి, స్ట్రాబెర్రీ ఇలా ఏదైనా కావొచ్చు.. ప్రతి సీజనల్‌ పండుని పండుగలా ఎలా జరుపుకోవాలో నగరవాసులకు తెలుసు. ప్రస్తుతం సీతాఫల్‌(కస్టర్డ్‌ ఆపిల్‌) సీజన్‌ ప్రారంభమైంది. దాంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే అక్టోబర్‌ నెలలో హైదరాబాద్‌ నగరంలోని రెస్టారెంట్‌ డెజర్ట్‌ మెనూలకు ఈ క్రీమీ ఫ్రూట్‌ కొత్త రుచులను అద్దుతోంది.  


సీతాఫలం సీజన్‌లో నేరుగా పండ్లను తీసుకోవడం మాత్రమే కాకుండా భాగ్యనగరవాసులు దానిని అనేక రూపాల్లో ఆస్వాదిస్తున్నారు. అన్ని పండ్ల మాదిరిగానే సీతాఫల్‌ జ్యూస్‌లు సరే.. అయితే.. కూలింగ్‌ మిల్క్‌షేక్‌ల నుంచి రుచికరమైన ఐస్‌క్రీముల వరకు, స్వీట్లు, పేస్ట్రీలు.. వివిధ రకాల వంటకాలలో ఇవి మేళవించడం విశేషం.

వీలైనన్ని రూపాల్లో వెరైటీ డిష్‌లను తయారు చేసేందుకు ఉపయోగించ గల ఏకైక పండుగా సీతాఫలాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా సీతాఫల్‌ రబ్డీ అనేది సిటీ రెస్టారెంట్స్‌లో బాగా ఫేమస్‌. ఈ నేపథ్యంలో నగరంలో సీతాఫల్‌ రుచులు అందుబాటులో ఉన్న కొన్ని ప్రదేశాల గురించి..

అబిడ్స్‌లోని సుల్తాన్‌ బజార్‌లో ఉన్న మయూర్‌ జ్యూస్‌ సెంటర్‌ సీతాఫలం రుచులకు ఫేమస్‌. ముఖ్యంగా నిండుగా గుజ్జుతో ఉన్న సీతాఫల్‌ జ్యూస్‌ ఇక్కడ క్రీమీగా రుచికరంగా ఉంటుందనేది ఫ్రూట్‌ లవర్స్‌ మాట.

సికింద్రాబాద్, బండ్లగూడ, టోలిచౌకిలలో ఉన్న నైస్‌ జ్యూస్‌ సెంటర్‌ కూడా సీతాఫల వెరైటీలకు పేరొందింది. భిన్న రకాల పండ్ల పేరిట మలాయ్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందిన ఈ సెంటర్‌ సీతాఫల్‌ మలైని కూడా అందిస్తోంది.

సీతాఫల్‌.. వైరల్‌.. 

ఇటీవలే సీతాఫలం రుచి, దాని ఆకారంలో రుచికరమైన వంటకాన్ని ప్రముఖ భారతీయ పేస్ట్రీ చెఫ్‌ తేజస్వి చందేలా రూపొందించారు. ఈ వంటకం తయారీ వీడియో ఇన్‌స్ట్రాగామ్‌ రీల్‌ ఆన్‌లైన్‌లో అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ విషయంలో తనకు ఫ్రెంచ్‌ చెఫ్‌ సెడ్రిక్‌ గ్రోలెట్‌ ప్రేరణగా పేర్కొంది. అతడు పండ్లను పోలి ఉండే డెజర్ట్‌ల తయారీకి ప్రసిద్ధి చెందాడు.

పలువురు హోమ్‌ మేడ్‌ సీతాఫల్‌ బర్ఫీ, హల్వా, ఖలాఖండ్‌ కూడా తయారు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లపై అందిస్తున్నారు.  జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న నేచురల్‌ ఐస్‌క్రీమ్స్‌ కూడా చవులూరించే కస్టర్డ్‌ యాపిల్‌ రుచులకు కేరాఫ్‌. సీజనల్‌ స్పెషల్‌ సీతాఫల్‌ ఐస్‌ క్రీం ఇక్కడ ఫేమస్‌.

బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.13లో ఉన్న లె టెసోరోలో ఓ ప్రత్యేక సీతాఫల్‌ రుచి అందుబాటులో ఉంది. సీతాఫల్‌ సోఫుల్‌ జార్‌ పేరిట అందించే ఈ డిసర్ట్‌.. వావ్‌ అనిపిస్తుంది.

జూబ్లీహిల్స్‌లో రోడ్‌ నం.36లో ఉన్న కృష్ణపట్నం రెస్టారెంట్‌కి సీతాఫల్‌ లవర్స్‌ ఓ రౌండ్‌ కొట్టొచ్చు. ఇక్కడి కస్టర్డ్‌ యాపిల్‌ డిలైట్‌ కృష్ణపట్నం డిలైట్‌గా పేరొందింది.

కొండాపూర్‌ లోని తారా– సౌత్‌ ఇండియన్‌ కిచెన్‌ కూడా ఈ సీజనల్‌ ఫ్రూట్‌ని వడ్డిస్తోంది. ఈ సీజన్‌లో తారాస్‌ సీతాఫల్‌ రబ్డీని రుచి చూడటం సిటీలోని ఫుడ్‌ లవర్స్‌కి ఓ అలవాటు.

బంజారాహిల్స్‌లో ఉన్న సీతాఫల్‌ ఫ్రెష్‌ జ్యూస్‌ తన పేరులోనే ఈ ఫలాన్ని ఇముడ్చుకోవడంతో పాటు పలు రకాల మిల్క్‌ షేక్స్‌లోనూ మేళవిస్తోంది. సీతాఫలాన్ని ఇష్టపడేవారి కోసం మిల్క్‌ షేక్‌లతో సహా వివిధ రకాల కస్టర్డ్‌ యాపిల్‌ డెజర్ట్‌లను అందిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.