దేశంలో కార్ల మార్కెట్ జెట్ స్పీడ్ లో పరుగులు తీస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతున్న కాలం, పరిస్థితులు, అవసరాల అనుగుణంగా ఆధునిక జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు అనేక ఫీచర్లలో రకరకాల కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ అనేక కంపెనీలు సూపర్ ఫీచర్లతో సరికొత్త కార్లను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ పేరుతో మరో కారును విడుదల చేసింది.కేవలం రూ.7.99 లక్షల ధరలో లాంచ్ చేసిన ఈ కారు కచ్చితంగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిట్రోయెన్ రిలీజ్ చేసిన నయా కారు గురించి వివరాలను తెలుసుకుందాం.
2021లో ఎంట్రీ
మనదేశంలోని 2021లో సిట్రోయెన్ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ఆ కంపెనీ విడుదల చేసిన ఐదో కారుగా బసాల్ట్ నిలిచింది. కొత్తగా విడులైన బసాల్ట్ కూపే ఎస్‌యూవీని రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. అక్టోబర్ 31 వరకూ బుకింగ్ చేసుకున్న వారికి ఈ ధర వర్తిస్తుంది. ఇతర వేరియంట్ల ధరలను ఆగస్టు తర్వాత ప్రకటించనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన కూపే ఎస్‌యూవీని కంపెనీ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో, దాని అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 11,001తో బుక్ చేసుకోవచ్చు.
ఆకట్టుకునే డిజైన్
సిట్రోయెన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ డిజైన్ ఆ కంపెనీ గతంలో విడుదల చేసిన కార్లపై ఆధారపడింది. కానీ వాటికన్నా మెరుగ్గా, స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. మార్కెట్ లోని ఇతర ఎస్‌యూవీలకు భిన్నంగా కనిపిస్తోంది. మృదువైన రూఫ్‌లైన్, రెండు స్లాట్‌లతో క్రోమ్ గ్రిల్ ఏర్పాటు చేశారు. అలాగే ఎక్స్ ఆకారపు డీఆర్ ఎల్లతో సొగసైన ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఆకట్టుకుంటున్నాయి. డైనమిక్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో పాటు సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, త్రీ-లైట్ స్ట్రిప్‌తో చుట్టిన ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. బసాల్ట్ కారు పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్ రంగులలో వస్తుంది. తెలుపు, ఎరుపు ఎంపికలు బ్లాక్ అవుట్ రూఫ్‌ను కలిగి ఉంటాయి.
ప్రత్యేకతలివే..
కారు ఇంటీరియర్ విషయానికి వస్తే పరిశీలిస్తే డాష్‌బోర్డ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఏడు అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మాన్యువల్ ఐఆర్ వీఎంకి మద్దతు ఇచ్చే 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరో ముఖ్యమైన ప్రత్యేక లక్షణం ఏమిటంటే వెనుక సీట్లకు అండర్-థై సపోర్ట్, 15 వాట్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉన్నాయి. డ్యూయల్-టోన్ డిజైన్, మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసేతి ఓఆర్ వీఎంలు, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఆకట్టుకుంటున్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి.
ఇంజిన్ పనితీరు
సిట్రోయెన్ బసాల్ట్ ఎస్ యూవీ రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 81 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. 1.2 లీటర్ 3 సిలిండర్, టర్బో పెట్రోల్ 109 బీహెచ్ పీ పవర్ అందిస్తుంది. 1.2 నేచురల్ ఆస్పిరేటెడ్ మోడల్ లీటర్ కు 18 కిలోమీటర్ల మైలేజీ, 1.2 టర్బో పెట్రోల్ మాన్యువల్ లీటర్ కు 19.5 కిలోమీటర్లు, టర్బో పెట్రోల్ ఆటోమెటిక్ లీటర్ కు 18.7 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి.