ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారికి నెలకు రూ.30వేలు, భారీగా నిధులు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేలా.. ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను, వాలంటీర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు మదర్సాల్లో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’గా పేరు పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే వీరి నియామకానికి మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్‌ ఆమోదం తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 185 మదర్సాలు ఉండగా.. ఒక్కో మదర్సాలో ముగ్గురు చొప్పున 555 మంది విద్యావాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం అమలు కోసం ఏడాదికి రూ.13 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు అధికారులు. దీనికి ఆర్థికశాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన విద్యా విధానం అమల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రతి తరగతిలో కనీసం 15 మంది విద్యార్థులు ఉండి.. ఉర్దూ మాధ్యమం చదివే స్కూళ్లలో గౌరవ వేతనం కింద ఉర్దూ భాషా ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. కేంద్రం గతేడాది నుంచే దీన్ని అమలు చేసినా గత ప్రభుత్వ హయాంలో వినియోగించకోలేదు. కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది.

ఏపీలో మొత్తం 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉండగా.. వీటిలో 238 సూళ్లలో ప్రతి తరగతిలో 15 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఆ వెంటనే ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు రూ.30 వేలు గౌరవవేతనం కింద చెల్లించేలా రూ.10 కోట్లను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే అధికారులు నియామక ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.

2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం.. మదర్సాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు నవీన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యా వాలంటీర్లను నియమించింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయలేదు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మదర్సాల్లో విద్యావాలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది. త్వరలోనే విద్యా వాలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు.

లంబసింగ్ మ్యూజియం కోసం నిధులు విడుదల
మరోవైపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లంబసింగి సమీపంలోని తజంగి గ్రామంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణానికి రూ.6.75 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. మొత్తం రూ.35 కోట్లతో మ్యూజియాన్ని నిర్మిస్తుండగా.. ఇందులో కేంద్రం వాటా రూ.15 కోట్లు కాగా.. రాష్ట్ర వాటా రూ.20 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్లో రూ.6.75 కోట్లు విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.