అమెరికాలో మరో విమానం మిస్సింగ్

అమెరికాలో శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) మరో విమానం (Flight missing) మిస్సయింది. బేరింగ్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన సెస్నా 208బీ గ్రాండ్‌ కారవాన్‌ అలస్కా (Alaska) మీదుగా ఉనాలక్‌లీట్ నుంచి నోమ్‌కు (Unalakleet to Nome) వెళ్తుండగా తప్పిపోయినట్లు తెలుస్తోంది.


విమానం మిస్సింగ్ సమయంలో అందులో ఒక పైలట్‌ సహా 9 మంది ప్రయాణికులు (1 pilot and 9 passengers) ఉన్నట్లు సమాచారం. నార్టోన్‌ సౌండ్‌ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఏటీసీతో విమానం కమ్యూనికేషన్ కోల్పోయిందని సమాచారం. విమానం రాడార్‎ వ్యవస్థతో సంబంధం కోల్పోవడంతో వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అదృశ్యమైన విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలస్కాలోని ప్రతికూల వాతావరణంగా కారణంగానే విమానం అదృశ్యమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

కాగా, వారం రోజుల క్రితం ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్‌ సమీపంలో విమానం కుప్ప కూలి.. ఆరుగురు మృతి చెందారు. అంతకుముందే వాషింగ్టన్‌ డీసీ సమీపంలోని రొనాల్డ్‌ రీగన్‌ జాతీయ విమానాశ్రయం వద్ద ఓ ప్రయాణికుల విమానం ల్యాండ్‌ అవుతుండగా.. సైనిక హెలికాప్టర్‌ ఢీకొన్న సంగతి తెలిసిందే. ఆ విమానంలోని 64 మంది ప్రయాణికులు, హెలికాఫ్టర్‌లోని నలుగురు సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే.