ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్స్‌తో హాట్ టాపిక్‌గా అయ్యారు. లడ్డు వివాదం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్‌లో సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.
కాగా ఒకానొక సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ పై సీరియస్ అవ్వడంతో ఈ మ్యాటర్ మరింత వైరల్ అయ్యింది. లడ్డు వివాదం పై పవన్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ కు ఏం సంబంధం.? ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు.? అంటూ ఫైర్ అయ్యారు. దాంతో ప్రకాష్ రాజ్ వీడియో రూపంలో రీప్లే ఇచ్చారు. నా ట్వీట్ మీకు సరిగ్గా అర్ధం కాలేదు అనుకుంటా..? నేను విదేశాల్లో ఉన్నాను తిరిగి వచ్చిన తర్వాత మీకు సమాధానం చెప్తా అని అన్నారు.
దాని తర్వాత వరుసగా ట్వీట్స్ వదులుతూనే ఉన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని ప్రకాష్ రాజ్ అంటున్నారు. ‘ గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్’ అంటూ.. అలాగే ‘ మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన..అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్’ అంటూ రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్.
రీసెంట్ గా ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి’ అని పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశారు ఈ వర్సటైల్ యాక్టర్. గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతికి విషెస్ తెలుపుతూనే.. ‘ఒకవేళ నువ్వు మైనారిటీలో భాగమైనప్పటికీ.. నిజం ఎప్పటికీ నిజమే’ అని గాంధీజి చెప్పిన మాటలను, అలాగే ‘ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకు ఉన్నాయి. కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాము. ఇదే మనకు, పాకిస్థాన్‌కు ఉన్న తేడా’ అని లాల్‌బహదూర్ శాస్త్రి చెప్పిన మాటలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.