ఏపీ గ్రామ, వార్డు సచివాలయాలకు మరో షాక్..! త్వరలో అమల్లోకి..

పీలో గత వైసీపీ హయాంలో అమల్లోకి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ద ఆశించిన స్ధాయిలో ప్రజలకు సేవలు అందించలేకపోతోందని భావిస్తున్న కూటమి సర్కార్ తాజాగా పూర్తి స్ధాయిలో ప్రక్షాళన చేపడుతోంది.


ఇందులో భాగంగా సచివాలయాల వర్గీకరణ, ఉద్యోగుల విభజన, కొత్త సేవల జోడింపుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పనితీరు మెరుగుపర్చడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు విషయంలో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు పూర్తి స్ధాయిలో సంతృప్తి లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారుల్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలపై పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీవోల్ని నియమించబోతున్నారు. అలాగే వార్డు సచివాలయాలకు మున్సిపల్ అధికారుల్ని నియమించనున్నారు.

ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో పర్యవేక్షకులుగా నియమించేందుకు వీలుగా రాష్ట్రంలో 660 మంది గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులు, జడ్పీ మండల కార్యాలయాల్లో పరిపాలన అధికారులకు డిప్యూటీ మండల పరిషత్ అధికారులుగా ప్రమోషన్లు కూడా ఇచ్చారు. వీరిని గ్రామ సచివాలయాల పర్యవేక్షణకు నియమిస్తారు. ఇందుకోసం వీరిని డిప్యుటేషన్ పై సచివాలయాల శాఖకు బదిలీ చేయబోతున్నారు. అలాగే 123 మంది మున్సిపల్ శాఖలో ఉప, అదనపు కమిషనర్లను వార్డు సచివాలయాల్లో పర్యవేక్షణ అధికారులుగా డిప్యుటేషన్ పై తీసుకోనున్నారు..

ఇలా గ్రామ, వార్డు స్ధాయిలతో పాటు జిల్లా స్దాయిలోనూ పర్యవేక్షణ అధికారుల్ని నియమించబోతున్నారు. జిల్లా స్ధాయిలో సచివాలయాల పర్యవేక్షణాధికారులుగా జడ్పీ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారుల్ని నియమిస్తారు. ఇందులో 70 శాతం పంచాయతీరాజ్ శాఖ నుంచి మరో 30 శాతం మున్సిపల్ శాఖ నుంచి డిప్యుటేషన్ పై సచివాలయాల శాఖ తీసుకుంటుంది. వీరిని ఈ నెలాఖరులోగా నియమించాలని ప్రభుత్వం ఆదేశాలు పంపుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.