అన్నదాతలపై మరో పిడుగు

www.mannamweb.com


అన్నదాతలపై మరో పిడుగు పడింది. ఇప్పటికే పెట్టుబడి సాయం అటకెక్కించడంతో పాటు గతేడాదికి సంబంధించి ఉచిత పంటల బీమా కింద రావాల్సిన పరిహారంపై కూడా నోరు మెదపని కూటమి సర్కారు..

విత్తన పప్పుశనగపై అందించే రాయితీని తాజాగా కుదించేసింది. గతేడాది, ఈ ఏడాది కరువు పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో సబ్సిడీ పెంచి విత్తన పప్పుశనగ అందాల్సింది పోయి సబ్సిడీ కుదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పప్పుశనగపై 25 శాతం రాయితీ..

రబీలో పప్పుశెనగ సాగు చేసే రైతులకు రాయితీతో విత్తనం పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. అందుకోసం జిల్లాకు జేజీ-11 రకం పప్పుశనగ విత్తనం 27,139 క్వింటాళ్లు కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాకు 1,143 క్వింటాళ్లు విత్తనం కేటాయించారు. అయితే రాయితీ మాత్రం 25 శాతం మాత్రమేనని ప్రకటించారు. క్వింటా పూర్తి ధర రూ.9,400 కాగా అందులో 25 శాతం రాయితీ రూ.2,350 పోనూ క్వింటాకు రూ.7,050 ప్రకారం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా 200 కిలోలు అంటే 2 క్వింటాళ్లు పంపిణీ చేయనున్నారు. ఒక ఎకరా ఉన్న రైతులకు 10 కిలోలు కలిగిన ప్యాకెట్లు రెండు, రెండు ఎకరాలకు నాలుగు ప్యాకెట్లు, మూడు ఎకరాలకు ఆరు ప్యాకెట్లు, నాలుగు ఎకరాలకు 8 ప్యాకెట్లు, ఐదు ఎకరాలు అంతకన్నా ఎక్కువగా ఉన్న రైతులకు 10 ప్యాకెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

గతేడాది 40 శాతం రాయితీ..

గత రబీలో అప్పటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఏటా క్రమం తప్పకుండా రైతు భరోసా-పీఎం కిసాన్‌ అందిస్తూనే…. జూలై నెలలోపే ఉచిత పంటల బీమా కింద పెద్ద ఎత్తున పరిహారం కూడా అందించింది. అలాగే రబీలో విత్తన పప్పుశనగపై గతేడాది 40 శాతం రాయితీ అందించింది. క్వింటా రూ.8,100 కాగా అందులో 40 శాతం రూ.3,240 పోనూ రైతుల వాటా కింద రూ.4,680 ప్రకారం కట్టించుకున్నారు.

విత్తన పప్పుశనగ రాయితీకి

కత్తెర వేసిన కూటమి సర్కారు

ఏకంగా 25 శాతానికి కుదింపు

రైతుల కు క్వింటాపై గతేడాది కన్నా రూ.2,370 భారం