ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణించాలంటేనే నిన్నటి వరకూ వెన్నులో వణుకు పుట్టేది. అందుకు కారణం గతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాలు. ఇప్పుడు నాన్ ఏసీస్లీపర్ బస్సులో కూడా మంటలు చెలరేగి కాలి బూడిదైంది.
శివమొగ్గ జిల్లాలోని హోసనగర నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ నాన్-ఏసీ స్లీపర్ బస్సు మంగళవారం రాత్రి (జనవరి 27, 2026) హోసనగర తాలూకాలోని సుదూర్ సమీపంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. 36 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు సుదూర్‌కు చేరుకుంటున్న సమయంలో డ్రైవర్ క్యాబిన్‌లో పొగలు కనిపించాయి. భయాందోళనకు గురైన డ్రైవర్ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో బస్సును ఓ చెట్టును ఢీకొట్టి ఆపినట్లు సమాచారం.
అప్పటికి ప్రయాణికులు నిద్రపోకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. బస్సు చెట్టును ఢీ కొట్టడంతో అలర్టైన ప్రయాణికులు.. కిటికీలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచి బస్సు నుంచి బయటకు దూకారు. ఈ క్రమంలో డ్రైవర్, కండక్టర్ సహా ముగ్గురికి కాలిన గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై బి. నిఖిల్, శివమొగ్గ జిల్లా ఎస్పీ, స్పందిస్తూ.. “ఇది నాన్-ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులు వెంటనే కిటికీలు తెరిచి బయటకు దిగగలిగారు. పెద్ద ప్రాణనష్టం తప్పింది. ముగ్గురికి కాలిన గాయాలు, మరికొందరికి బస్సు దూకే క్రమంలో గాయాలు అయ్యాయి” అని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో శ్రీ అన్నపూర్ణేశ్వరి ట్రావెల్స్ కు చెందిన బస్సు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.



































