సికింద్రాబాద్ నుండి మరో వందే భారత్ రైలు.. ఎక్కడికంటే

www.mannamweb.com


దేశంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సరికొత్త రైళ్లను తీసుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎక్స్ ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ రైళ్లు, అలాగే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లను తీసుకు వచ్చింది. త్వరలో మెరపు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైలును కూడా పరుగులు పెట్టించనుంది. కాగా, ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా, సురక్షితంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి వందే భారత్ రైళ్లు. దేశ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రైళ్లను నడుపుతోంది కేంద్రం. ఈ ట్రైన్లకు బాగా ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఇప్పుడు మరో 10 కొత్త వందే భారత్ రైళ్లు ట్రాకులపై రన్ చేయబోతున్నాయి. సెప్టెంబర్ 15న ప్రధాని మోడీ ఈ రైళ్లను ప్రారంభిస్తారు. కాగా, ఇందులో ఒకటి తెలుగు రాష్ట్రానికి కేటాయించింది

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని హైదరాబాద్ నుండి మహారాష్ట్ర మధ్య ఓ రైలు నడవనుంది. సికింద్రాబాద్ నుండి నాగ్ పూర్ మధ్య ఈ ట్రైన్ రన్ కాబోతుంది. ఈ రెండు నగరాల మధ్య 578 కి.మీ దూరం ఉండగా.. కేవలం 7 గంటల్లోనే గమ్య స్థానాలకు చేర్చనుంది. అందిన సమాచారం ప్రకారం.. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుండి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మరీ ఈ రైలు ఏఏ స్టేషన్లలో ఆగుతుందో తెలుసా..? ఆ వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుందని వెల్లడించారు అధికారులు. హైదరాబాద్ నగరం నుండి ముంబయికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. వ్యాపారం, ఇతర పనుల నిమిత్తం దేశ ఆర్థిక నగరితో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు ఓ వందే భారత్ రైలు ఉండాలన్న ప్రతిపాదన జరిగింది. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ మరింత పెరగనుంది. ఈ రాబోతున్న రైలుతో ఇప్పుడు తెలంగాణ నుండి మూడు రాష్ట్రాలకు వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్లు అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి ఏపీలోని తిరుపతికి, విశాఖ పట్నం అలాగే కర్ణాటకలోని బెంగళూరుకు మధ్య రైళ్లు నడుస్తున్నాయి.