Special Police Officers: ఏపీలో పోలీస్ శాఖ అలర్ట్.. జిల్లాలకు ప్రత్యేక ఆఫీసర్ల నియామకం!

Special Police Officers Appointed to Districts: ఏపీలో ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, పోలింగ్ రోజు, ఆ తరువాత ఏపీలో పలు చోట్లా హింసాత్మక సంఘటనలు చెలరేగిన విషయం కూడా తెలిసిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.


56 మంది ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించినట్లు సమాచారం. అందులో పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక పోలీస్ అధికారులుగా నియమించబడ్డ పోలీస్ అధికారులు వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే, సున్నితమైన నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని అందులో ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద, పరిసర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని, ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఆ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం టేబుల్స్ ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు టేబుల్స్ ఏర్పాటు విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా పలు సూచనలు చేసిన విషయం విధితమే. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు పాదరదర్శకంగా జరగాలని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని కూడా వీడియోగ్రఫీతో చిత్రీకరించాలని ఆయన సూచించిన విషయం విధితమే.