Andhra Pradesh : అంత అత్రమేల జవహరా!

అస్మదీయులకు ఐఏఎస్‌ కట్టబెట్టేందుకు ఆరాటం


కోడ్‌ ఉందని తెలిసీ యూపీఎస్సీకి లేఖ.. ఇంటర్వ్యూలకు జూన్‌ 7న కమిషన్‌ షెడ్యూలు

ఈ నెలాఖరులోపే పూర్తి చేసేద్దామన్న సీఎస్‌.. ఫలితాల తర్వాత తాము బిజీ అవుతామని వెల్లడి

కోడ్‌ఉండగా కుదరదని తేల్చిన యూపీఎస్సీ.. ఫిబ్రవరిలో అత్యంత గోప్యంగా నోటిఫికేషన్‌

సమాచారం లేక అర్హులకు అన్యాయం.. గతంలో ఇద్దరు అస్మదీయులకు ఐఏఎస్‌ హోదా

ఇప్పుడూ అదే పని చేసేందుకు జవహర్‌, ధనుంజయ్‌ పన్నాగం

కనీస అనుభవం లేని మహిళాధికారి పేరూ ప్రతిపాదన

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు కూడా భర్తీ చేయరు. కానీ… ఏకంగా కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిద్దామని సీఎస్‌ జవహర్‌ రెడ్డి యూపీఎస్సీకి లేఖ రాశారు. సర్కారు మారిపోతే సంగతేమిటో అనే ఆందోళనతో తెగ ఆరాటం ప్రదర్శిస్తున్నారు.

(అమరావతి – ఆంధ్రజ్యోతి)

ఐదేళ్లూ అడ్డగోలుగా అస్మదీయులకు మేళ్లు చేసిన వైసీపీ సర్కారు… చివరికి, ఎన్నికలు ముగిసి, ఫలితాల ముంగిటా అదే పని చేస్తోంది. అయిన వారికి కన్ఫర్డ్‌ ‘ఐఏఎస్‌’ కట్టబెట్టేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆపసోపాలు పడుతున్నారు. ఎడతెగని ఆత్రం ప్రదర్శిస్తున్నారు. ఇంటర్వ్యూల నిర్వహణకు యూపీఎస్సీ ఖరారు చేసిన తేదీలను కూడా మార్చేసి… ఫలితాలు వెలువడే లోగానే పని పూర్తి చేసుకోవాలని తహతహలాడుతున్నారు. సీఎస్‌ ఆరాటం, ఆత్రం చూసి అధికార యంత్రాంగం కూడా ముక్కున వేలేసుకుంటోంది.

ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉంది. పోలింగ్‌, అనంతరం జరిగిన హింసతో రాష్ట్రం అట్టుడుకుతోంది. కౌంటింగ్‌ రోజు ఇంతకంటే భారీగా గొడవలు జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సీఎ్‌సగా దీనిపై దృష్టి సారించాల్సిన జవహర్‌ రెడ్డి… వీటన్నింటినీ పక్కనపెట్టేశారు. తన వాళ్లకు ఐఏఎస్‌ ఇప్పించుకునే అంశంపైనే దృష్టిపెట్టారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఇప్పుడు కొత్త పోస్టింగ్‌లు ఇవ్వడానికి లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని యూపీఎస్సీ కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ పదోన్నతులకు సంబంధించిన ఇంటర్వ్యూలను జూన్‌ 7న నిర్వహించాలని నిర్ణయించింది. కానీ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత రాజెవరో, బంటు ఎవరో తెలియదు!

తమ వాళ్లకు ఐఏఎస్‌ దక్కుతుందో లేదో తెలియదు! అందుకే.. ప్రభుత్వం మారే లోపే పని పూర్తి చేసుకునేందుకు జవహర్‌ రెడ్డి ఆరాట పడుతున్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఇంటర్వ్యూలు జూన్‌ 7వ తేదీని నిర్వహిద్దామని, ఆ సమయానికి ఢిల్లీలో అందుబాటులో ఉండాలని యుపీఎస్సీ లేఖలో సృష్టంగా పేర్కొంది. దీంతో ఆయన యూపీఎస్సీకి లేఖ రాశారు. ‘‘జూన్‌ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ ఉంది. ఆ తర్వాత రెండు రోజులపాటు మా షెడ్యూల్‌ బిజీగా ఉంటుంది. అందువల్ల 7వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు రాలేకపోవచ్చు.

ఇంటర్వ్యూలు మే చివరి వారంలో లేదా మే 31వ తేదీన పూర్తి చేద్దాం’’ అంటూ యూపీఎస్సీకి ఉచిత సలహా ఇచ్చారు. జవహర్‌ రెడ్డి స్పందన వెనుక ఉద్దేశాలు సుస్పష్టం! ఈ లేఖను పరిశీలించిన యూపీఎస్సీ సూటిగా, ఘాటుగా సమాధానం పంపింది. ‘‘జూన్‌ 6 వరకూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుంది. మే నెలలో ఇంటర్వ్యూలు చేయడం కుదరదు’’ అని సీఎ్‌సకు స్పష్టం చేసింది. దీంతో సీఎ్‌సకు ఇప్పుడు దిక్కు తోచడం లేదు.

ఆది నుంచీ రహస్యమే..

ప్రస్తుతం రాష్ట్రంలో నాన్‌ రెవెన్యూ ఐఏఎస్‌ పోస్టులు రెండు ఖాళీలున్నాయి. ఈ రెండు పోస్టుల్లో ‘తమ’ వారినే నియమించుకోవాలని వైసీపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులోనూ సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఇద్దరూ చక్రం తిప్పుతున్నారు. ఈ రెండు పోస్టుల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అత్యంత రహస్యంగానే వ్యవహరిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న జీఏడీ రెండు పోస్టుల భర్తీకి గుట్టుగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మార్చి 7నాటికి అన్ని శాఖల ఉద్యోగులు దరఖాస్తులు అందించాలని పేర్కొంది. కొన్ని శాఖల్లో అర్హత కలిగిన ఉద్యోగులకు నోటిఫికేషన్‌ ఇచ్చారన్న సమాచారం కూడా లేదు. దీంతో రెండు పోస్టులకు 46 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటిని జీఏడీ అధికారులు స్ర్కూటినీ చేసి 10మంది పేర్లు సిఫారసు చేశారు. ఈ లిస్ట్‌ చూస్తే చాలు.. దీనిపై సీఎస్‌ ప్రభావం అర్థమవుతుంది.గడికోట మాధురి, భూమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, ఎం.కె.వి.శ్రీనివాసులు, డా.ఎం.వరప్రసాద్‌, డి.దేవానంద రెడ్డి, పి.ఎ్‌స.సూర్యప్రకాశ్‌, జి.రాజారత్న, సి.బి.హరినాథ్‌ రెడ్డి, సి.హెచ్‌.పుల్లారెడ్డి, ఏఏఎల్‌ పద్మావతి పేర్లను కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదాకోసం ప్రతిపాదించారు.

వీరిలో ఐదుగురు కడప జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గం అధికారులు కావడం గమనార్హం. అందులో నూ… ఈ పదిమందిలో ఏడుగురు గత ఏడాది పంపిన జాబితాలోనూ ఉన్నారు. అప్పట్లో కడప జిల్లాకు చెందిన నీలకంఠా రెడ్డి, అనిల్‌ రెడ్డిలకు ఐఏఎస్‌ దక్కింది. ఇందులో నీలకంఠా రెడ్డి సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి పేషీలో అధికారి.

ఇక… అనిల్‌ రెడ్డిని జగన్‌ నేరుగా ఎంపిక చేసినట్లు చెబుతారు. ఇక… తాజా జాబితాలోనూ కనిపించిన ఇందులో గడికోట మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆమె స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి. డీడీ స్థాయిలో కనీసం ఎనిమిదేళ్లు పనిచేస్తేనే కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సకు అర్హత లభిస్తుంది. 2007 గ్రూప్‌-1 బ్యాచ్‌ చెందిన మాధురి 2023లో డిప్యూటీ డైరెక్టర్‌ కేడర్‌లోకి వచ్చారు. కేవలం ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి ఓఎస్డీగా పని చేయడమే అర్హతగా భావిస్తూ… కనీస అనుభవం లేకున్నా కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సల జాబితాలో చేర్చేశారు. జవహర్‌ రెడ్డి, ధనుంజయ రెడ్డి అండదండలే దీనికి కారణమని చెబుతారు. ఆమెకు ఐఏఎస్‌ ఇప్పించేందుకు ఇద్దరు అధికారులు చేయని ప్రయత్నాలు, పడని పాట్లు లేవు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున యూపీఎస్సీ ఇంటర్వ్యూలు ఆపేయకపోతే ఆమెకు ఐఏఎస్‌ ఖరారయ్యేదని చెబుతున్నారు.

దరఖాస్తులే తీసుకోలేదు..

కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సల విషయంలో ప్రభుత్వం, సీఎస్‌, ధనుంజయరెడ్డి గేమ్‌లో చాలా మంది అర్హత కలిగిన ఉద్యోగులు బలైపోయారు. నోటిఫికేషన్‌ రహస్యంగా ఉంచడంతో పాటు కొన్ని శాఖల అధికారుల దగ్గర నుంచి దరఖాస్తులే తీసుకోలేదు. ఈ పోస్టులకు వాణిజ్య పన్ను శాఖ అధికారుల నుంచి ఎక్కువగా దరఖాస్తులు అందుతాయి. కానీ… నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతే తెలియకపోవడంతో ఒక్కరంటే ఒక్కరూ దరఖాస్తు చేసుకోలేకపోయారు.

చివరి నిమిషంలో ఈ విషయం తెలిసి… సుమారు పది మంది తమ దరఖాస్తులు సిద్ధం చేసుకుని మార్చి 7వ తేదీ సాయంత్రం జీఏడీకి వెళ్లారు. కానీ.. వాటిని తీసుకునేందుకు అధికారులు ససేమిరా అన్నారు. అత్యంత రహస్యంగా అస్మదీయులకు ఐఏఎ్‌సలు కట్టబెట్టేందుకు ఆడిన నాటకంలో ఇలా ఎంతోమంది అర్హులు బలైపోయారు.