అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజిన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29, 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలివే..
ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం
పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబరు 15)ని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహణకు ఆమోదం
ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు ఆమోదం
ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్ పాలసీకి ఆమోదం
ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం
పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులను ఆమోదం.
జేజేఎం వినియోగంలో జాప్యంపై సీఎం అసంతృప్తి..
కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ (జేజేఎం) వినియోగంలో జాప్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మిషన్.. డీపీఆర్ స్థాయి దాటి ముందుకెళ్లట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని దిల్లీలోనూ ప్రచారం జరుగుతోందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావడం లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రతి ఒక్కరికీ చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్టు అని.. మిషన్ మోడ్‌లో పనిచేస్తే పథకం అధ్భుత ఫలితాలను ఇస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పథకాల సక్రమ వినియోగంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి అయిన దృష్ట్యా పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. మద్యం, ఇసుక, రేషన్ మాఫియాలను అరికట్టామని సీఎం అన్నారు. బియ్యం, భూ దురాక్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందని, ఈ మాఫియాలను అరికడతామని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ పోర్టులో 41 శాతం వాటాను అరబిందో వాళ్లు లాక్కున్నారని, ఆస్తులు లాక్కోవడం వైకాపా హయాంలో ట్రెండ్‌గా మారిందన్నారు.