AP Cabinet: ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

www.mannamweb.com


AP Cabinet: ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. క్యాబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేసే అవకాశముంది. దీనిపై భేటీలో చర్చిస్తున్నారు. వైకాపా హయాంలో ఎక్సైజ్‌ శాఖలో జరిగిన అవకతవకలు, మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై చర్చ జరుగుతోంది. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ క్యాబినెట్‌లో తీర్మానం చేసే అవకాశముంది.

సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మ, పేరు తొలగింపు..
మాజీ సీఎం జగన్‌ బొమ్మ, పేరు ఉన్న సర్వేరాళ్లను ఏం చేయాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. బొమ్మల పిచ్చితో జగన్‌ రూ.700కోట్లు వాడేశారని.. సర్వే రాళ్లపై ఆయన బొమ్మతో పాటు పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారు. దీంతో సర్వేరాళ్లపై జగన్‌ బొమ్మ, పేరు తొలగించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. జగన్‌ ఫొటో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో.. రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జగన్‌ బొమ్మ ఉన్న పుస్తకాలను వెనక్కి తీసుకోనుంది. మరోవైపు భూముల రీ సర్వేపై క్యాబినెట్‌లో రెవెన్యూ శాఖ నోట్‌ సమర్పించింది. సర్వే వల్ల తలెత్తిన వివాదాలపై సమావేశంలో చర్చ జరిగింది. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల్లో ఆందోళన ఉందని పలువురు మంత్రులు అన్నారు. భూయజమానుల్లో ఆందోళనతో గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. దీంతో రీ సర్వే ప్రక్రియను అబేయెన్స్‌లో పెట్టాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.