Andhra News: నేడు ఏపీ క్యాబినెట్‌ భేటీ.. సూపర్‌ 6 పథకాల అమలుపై చర్చ!

www.mannamweb.com


అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. సోమవారం నాటి మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్‌ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు.

మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నట్లు తెలిసింది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపైనా వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.