ఏపీ కానిస్టేబుళ్ల నియామక తుది ఫలితాలు వచ్చేశాయ్. మంగళగరిలోని డీజీపీ కార్యాలయంలో…. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఈ ఫలితాలను విడుదల చేశారు.
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ ( https://slprb.ap.gov.in/ ) లో ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి.
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ అక్టోబర్ 2022లో వచ్చింది. 2023 ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఇందుకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి 2024 డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో 38,910 మంది అర్హత సాధించారు.
ఈ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలై రెండేళ్లకుపైగా కావొస్తోంది. పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించిన కూటమి సర్కార్… నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు.. ఇవాళ ఫలితాలను విడుదల చేశారు.































