AP Elections : 1200 మందిని అరెస్టు. జైలు సరిపోవడం లేదు

Palnadu: 1200 మందిని అరెస్టు చేశాం.. నరసరావుపేట జైలు సరిపోవడం లేదు: ఎస్పీ మలికా గార్గ్‌


పల్నాడు జిల్లాలో పోలింగ్‌ సందర్భంగా ఆ తర్వాత జరిగిన హింసకు సంబంధించి దాదాపు 1200 మందిని అరెస్టు చేశామని ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ‘‘పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. చెడు ఘటనలతో పల్నాడు ప్రచారంలోకి రావడం బాధిస్తోంది.
జిల్లాలో ఇంత ఫ్యాక్షనిజం ఉందా?అని అని నా స్నేహితులు అడుగుతున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, మాచర్ల పేరు చెడుగా మార్మోగుతోంది. కర్రలు, రాడ్లు చేతుల్లో పట్టుకుని తిరగడం, దాడులు అవసరమా? పది రోజుల్లో జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయి. దాదాపు 1200 మందిని అరెస్టు చేశాం.
నరసరావుపేట జైలులో ఖాళీలేక రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నాం. ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు వస్తే ఇళ్లలోనే కూర్చుని వినండి. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు రోడ్లపై ఎవరూ తిరగవద్దు. జిల్లాలో 144 సెక్షన్‌ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. శాంతిభద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు నేను కూడా పల్నాడు జిల్లా వాసినే .. ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే నా లక్ష్యం’’ అని ఎస్పీ స్పష్టం చేశారు.