AP Gazette Notification : ఇట్స్ అఫీషియల్.. ముద్రగడ పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్

AP Gazette Notification on Mudragada Padmanabham Name : మాటంటే.. మాటే.. ఛాలెంజ్ చేసినట్లు ముద్రగడ తన పేరును మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. వైసీపీ మళ్లీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్ చేశారు. దీంతో పెద్దఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది జరగకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ ఛాలెంజ్ చేశారు.


ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడటం.. పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో.. చెప్పినట్లే ముద్రగడ తన పేరును మార్చుకున్నారు. ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ ఏడాది మార్చి 27న ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. తనకెలాంటి పదవి అక్కర్లేదని, పార్టీ సిద్ధాంతాలు నచ్చే చేరినట్లు చెప్పుకొచ్చారు. అంతకుముందు వరకూ ఆయన జనసేన పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరగ్గా.. చివరి నిమిషంలో ఆయన చేరిక ఆగిపోయిందని టాక్ వచ్చింది. వైసీపీలో చేరాక.. పిఠాపురంలో పవన్ ను ఓడించే బాధ్యతను ఆయనకే అప్పగించింది అధిష్టానం.

సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ముద్రగడ పద్మనాభం తీర్పుపై ఆయన కుమార్తే ఆరోపణలు చేశారు. ఆమె జనసేనలో చేరేందుకు సిద్ధమవ్వగా.. పవన్ తన కుటుంబంలో చిచ్చుపెట్టారని ఆరోపించారు. పవన్ పై విమర్శలు చేస్తూ వచ్చిన ముద్రగడ.. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. ఛాలెంజ్ ప్రకారం ఆయన పేరు మార్చుకున్నారు.