ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి దోహదపడేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగానే అందించనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళిత వర్గాల సంక్షేమానికి దోహదపడేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం అజయ్ పథకాన్ని రాష్ట్ర పథకం ఉన్నతితో అనుసంధానం చేసింది. ఈ పథకం కింద దళితులకు ప్యాసింజర్ ఆటోలు, వ్యవసాయ పరికరాలను రాయితీపై అందిస్తోంది.
వీటి కొనుగోలుకు వడ్డీలేని రుణాలను కూడా బ్యాంకుల ద్వారా అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం రాష్ట్రంలో ఉపాధిని పెంపొందించడంలో భాగంగా దళితులకు ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు చర్యలు తీసుకుంది.
ఈ క్రమంలో మొత్తం 4,074 ప్యాసింజర్ ఆటోలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆటోలను సరఫరా చేయడానికి టెండర్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఈ పథకానికి రూ.122 కోట్ల వ్యయం అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర రాయితీ నిధుల ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
ఉన్నతి పథకం కింద ఎస్సీ రైతులకు వ్యవసాయ పరికరాలను 50% రాయితీతో అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2,685 మంది రైతులకు రూ.1.50 లక్షల విలువైన పవర్ స్ప్రేయర్లు, బోర్ డ్రిల్లర్లు, మోటార్ ఇంజిన్లు, మోటార్ రివైండింగ్ మెషిన్లు వంటి పరికరాలు పంపిణీ చేయనున్నారు. పథకం వ్యయంలో 50% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భరిస్తాయి. లబ్ధిదారులు 10% వాటాగా ఇవ్వాల్సి ఉంటుంది
లబ్ధిదారులకు వడ్డీ భారం లేకుండా చేయడానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పటి వరకు రుణాలను బ్యాంకుల ద్వారా తీసుకుని నెలవారీ వాయిదాల్లో చెల్లించేవారు. అయితే ఈ పథకం కింద వడ్డీతో కూడిన భారం దూరం చేయాలని నిర్ణయించారు.
ఆటోలు కొనుగోలుకు కావలసిన రూ.1.35 లక్షల మొత్తాన్ని సున్నా వడ్డీ రుణంగా అందించనున్నారు. ఇది ఆటోలకు మాత్రమే కాకుండా రైతులకు అందించే వ్యవసాయ పరికరాలకు కూడా వర్తిస్తుంది.
డ్వాక్రా సంఘాలలో ఎస్సీ మహిళలకు ఇప్పటికే వడ్డీలేని రుణాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విధానాన్ని ఆటోలు, వ్యవసాయ పరికరాల కోసం కూడా అమలు చేయనున్నారు. ఈ చర్యల ద్వారా దళిత వర్గాలకు ఆర్థిక స్వావలంబనను పెంపొందించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. ఈ పథకాలు దళితుల అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.