ఏపీ ప్రభుత్వ వరద పరిహారం అందలేదా! ఇలా తనిఖీ చేసుకోండి, ఏ బ్యాంకులో జమ చేశారో వివరాల్లేవు..

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో గత నెలలో వచ్చిన కృష్ణా, గోదావరి, బుడమేరు వరద బాధితులకు భారీగా పరిహారం చెల్లిస్తోంది. విజయవాడలో దాదాపు ఆరు లక్షల మంది ప్రజలు వరద ముంపు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారాన్ని అందలేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇలా తనిఖీ చేసుకోవచ్చు.

విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదల్లో ముంపు బాధితులకు పరిహారం చెల్లింపులో చిత్రాలు బయట పడుతున్నాయి. ఓ వైపు బాధితులకు పరిహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నా, చెల్లింపు ప్రక్రియ పూర్తి కావొచ్చిందంటూ అధికారులు ప్రకటనలు ఇవ్వడంపై బాధితులు మండి పడుతున్నారు. వరద పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదు. దాదాపు పదిరోజుల పాటు విజయవాడ కలెక్టరేట్‌లో మకాం వేసి ముఖ్యమంత్రి వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. లక్షలాది మంది ప్రజలు వరద ముంపుకు గురై సర్వం కోల్పోవడంతో బాధితుల్ని ఉదారంగా ఆదుకోడానికి పరిహారం ప్రకటించింది.

వరద ముంపుకు గురైన ప్రతి ఇంటికి గ్రౌండ్‌ ఫ్లోర్‌కు రూ.25వేలు, ఆపై ఉండే ఫ్లోర్‌లకు రూ.10వేలు చెల్లిస్తామని ప్రకటించారు. వరదల్లో మునిగిపోయిన ద్విచక్ర వాహనాలకు రూ.3వేలు, ఆటోకు రూ.10వేలు ప్రకటించారు. ఈ క్రమంలో వరద బాధితులకు పరిహారం చెల్లింపులో ఇప్పటికీ చాలామందికి పరిహారం అందలేదు. దీనికి ప్రభుత్వ అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారు.

వరద నష్టాన్ని గణించే సమయంలో చేసిన పొరపాట్లతో బాధితులకు న్యాయం జరగడం లేదు. హడావుడిగా నష్టం అంచనాలు రూపొందించడం, ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి పరిశీలిన బాధ్యతలు తాసీల్దార్లపై వదిలేయడం, తాసీల్దార్లు సచివాలయ సిబ్బందిపై ఆధారపడటం, వారు వాలంటీర్లను పురమాయించడంతో భారీ సంఖ్యలో బాధితులకు పరిహారం అందలేదు.

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ రెండో వారంలోనే ముంపు బాధితుల గణన చేపట్టింది. ఈ క్రమంలో గత గురువారం వరద బాధితులకు పరిహారాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ క్రమంలో వరద సాయం అందుకున్న వారిలో పలువురికి ప్రభుత్వం ఇచ్చిన సాయం బ్యాంకులు పాత బాకీల్లో జమ చేసుకున్నాయి. ఎవరికి పరిహారం ఎంత జమ చేశారనే లెక్కల్ని ఇప్పటి వరకు ప్రభుత్వం వెల్లడించలేదు.
నష్టం లెక్కింపుపై వెబ్‌సైట్‌లో వివరాలు..

మరోవైపు వరద బాధితులకు సంబంధించిన ఓ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా వరద ముంపుకు గురైన బాధితులు తమ ఇంటికి జరిగిన నష్టం ప్రభుత్వ లెక్కల్లో నమోదైందో లేదో తెలుసుకోవచ్చు. ఈ లింకులో ఆధార్‌ కార్డుతో సెర్చ్ చేయడం ద్వారా వరద బాధితుల జాబితాలో ఉన్నారో లేదో ధృవీకరించుకోవచ్చు.మరోవైపు వరద బాధితులకు అందిన సాయం వివరాలను ప్రతి ముంపు బాధితుడికి మెసేజీ రూపంలో సమాచారం ఇస్తామని ఏపీ రెవిన్యూ-విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. గత శుక్రవారం నాటికి నగదు అందుకున్న వారికి ఈ సందేశాలు అందాయి. ఇప్పటికి పలు ప్రాంతాల్లో వరద బాధితులకు పరిహారం చెల్లించలేదనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. జిల్లా అధికారులు మాత్రం బాధితులకు నష్ట పరిహారం ఇచ్చేసినట్టు చెబుతున్నారు. విజయవాడలో 32 డివిజన్లలో భారీగా వరద నష్టం వాటిల్లింది.

ప్రభుత్వ వెబ్‌సైట్‌లో బాధితుల వివరాలు, ఫోటోలు, నష్టం అంచనాలు ఉన్నా, ఏ బ్యాంకు ఖాతాలో ఎంత మొత్తం పరిహారం చెల్లించారనే వివరాలను మాత్రం నమోదు చేయలేదు. ఇప్పటి వరకు పరిహారం అందుకున్న వారికి కూడా ఎలాంటి సందేశాలు పంపలేదు. ఒకే ఇంట్లో వేర్వేరు కుటుంబాలు ఉన్నా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండే వారికి మాత్రమే పరిహారం పరిమితం చేశారు. మిగిలిన ఇళ్లను మినహాయించేశారు.
90శాతం చెల్లించేశామంటున్న అధికారులు…

1,09,729 మంది బ్యాంకు ఖాతాల్లో రూ. 173.69 కోట్ల జమ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వరద బాధితుల్లో 90 శాతం మేర లబ్ధిదారులకు ఆర్థిక సహాయం జమ చేసినట్టు చెబుతున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల మిగిలిన 10 మందికి శాతం పెండింగ్ ఉందంటున్నారు.

ముంపు ప్ర‌భావంతో న‌ష్ట‌పోయిన ప్ర‌తి కుటుంబానికీ ప్ర‌భుత్వం ప‌రంగా ఆర్థిక స‌హాయం అందుతోంద‌ని.. ఇప్ప‌టికే 90% మేర లబ్ధిదారులకు పరిహారం వారి బ్యాంకు ఖాతాల్లో జమైందని.. మిగిలిన 10 శాతం కూడా బ్యాంకు ఖాతాల్లో సమస్యల వల్ల పెండింగ్లో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తెలిపారు. వ‌ర‌ద ప్ర‌భావంతో ముంపున‌కు గురైన ఇళ్ల‌కు సంబంధించి 75,427 కుటుంబాల ఖాతాల్లో దాదాపు రూ. 160.47 కోట్ల మేర న‌గ‌దు జ‌మ‌ చేశామన్నారు.

పెండింగ్‌ పరిహారం నేడు క్లియర్ చేస్తాం..

4,315 కుటుంబాల‌కు సంబంధించి బ్యాంకు ఖాతాల స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయ‌ని.. మ‌రో 8 వేల కుటుంబాల‌కు సోమ‌వారం డీబీటీ ద్వారా ఖాతాల్లో ఆర్థిక స‌హాయం జ‌మ‌ కానుంద‌ని తెలిపారు. త్రిచ‌క్ర వాహ‌నాల న‌ష్టాల‌కు సంబంధించి 3,149 మందికి, ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కు 30,722 మందికి, తోపుడు బ‌ళ్ల‌కు 431 మందికి విజ‌య‌వంతంగా వారి ఖాతాల్లో ప‌రిహారం జ‌మైన‌ట్లు కలెక్టర్ తెలిపారు. ఇళ్లు, త్రిచక్ర, ద్విచక్ర, తోపుడుబండ్లకు సంబంధించి మొత్తంమీద ఇప్పటివరకు 1,09,729 ఖాతాలకు దాదాపు రూ. 173.69 కోట్ల మేర సొమ్ము జమ చేసినట్లు వివరించారు. బ్యాంకు ఖాతాల స‌మ‌స్య‌లున్న కేసుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి, ల‌బ్ధిదారుల‌కు ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. బ్యాంకు ఖాతాల్లో స‌మ‌స్య‌లు ఉన్న‌వారు త‌మ బ్యాంకు ఖాతాల‌ను స‌రిచూసుకోవాల‌ని, స‌త్వ‌రం బ్యాంకును సంప్ర‌దించి ఆధార్‌తో బ్యాంకు ఖాతాను లింక్ చేసుకోవాల‌ని సూచించారు.
వరద నష్టం అపారం- సహాయం పరిమితం

మరోవైపు వరద సాయం అందించడంలో తలెత్తిన లోపాలను సవరించకపోతే ఆందోళన బాట పడతామని సీపీఎం హెచ్చరించింది. రోజులు గడుస్తున్నా సహాయం అందడం లేదని, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు

29 రోజులు గడిచినా కుటుంబానికి ఇవ్వాల్సిన ఐదు లక్షల రూపాయల సహాయం అందలేదని ఆరోపించారు. రోజులు గడుస్తున్నా, కంపెనీలలో ఆటో రిపేర్లు సకాలంలో జరగటం లేదని, ఇన్సూరెన్స్ కంపెనీల వైఖరితో న్యాయం జరగటం లేదని, తాత్కాలిక రిపేర్లతోనే సరి పెట్టుకోవాల్సి వస్తోందని, ప్రభుత్వ సహాయం కొందరికే వచ్చిందని, పదివేల రూపాయల సహాయం చాలదని ఆటో కార్మికులు ఆరోపిస్తున్నారు. బాధితులను సంప్రదించకుండా ఇష్టానుసరం బ్యాంకుల్లో నగదు జమ చేయడాన్ని తప్పు పడుతున్నారు.

అద్దెకు ఉన్నవారికి పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని, అదే సందర్భంలో ఇంటి రిపేర్లకు సొంత ఇంటి యజమానికి కూడా సహాయం అందించాలని

బాధితులు కోరారు. కూటమి నేతలు పదవుల పంచుకోవడం కాదు, కూటమి ద్వారా వరద బాధితులకు సహాయం కేంద్రం నుండి విడుదల చేయించాలని,

వందలాది కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చి దాతలు ఆదుకుంటున్నారు, బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం నయా పైసా విడుదల చేయకుండా

నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీపీఎం మండిపడింది. వరదల్లో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వరదలువచ్చిన నెలరోజుల తర్వాత కూడా బాధితులకు పరిహారం చెల్లించలేదని సీపీఎం నాయకుడు చిగురుపాటి బాబురావు ఆరోపించారు.