ఏపీలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పాటించాల్సిన నిబంధనల రూపకల్పనకు ఉన్నత విద్యాశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో 13 మందితో కమిటీ ఏర్పాటు అయింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీలో జాతీయ మెంటల్ హెల్త్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, సైకాలజిస్ట్, సైక్రియాటిస్ట్, ఎన్‌జీఓలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నత విద్యామండలి ఛైర్మన్, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్, ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల నమోదు, వారి పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి వేదిక ఉండాలని అన్ని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జూలైలో తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాలు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై నిబంధనలు రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేలా ఉండాలని వెల్లడించింది. రెండు నెలల్లోపు నియమాలను తెలియజేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంపై సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్, విద్యార్థులను రక్షించడానికి, ఫిర్యాదులను పరిష్కరించడానికి నియమాలను రూపొందించడానికి తాజాగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సుఖ్‌దేబ్ సాహా వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ & అదర్స్ కేసులో సుప్రీంకోర్టు జూలై 25, 2025న ఇచ్చిన తీర్పును అనుసరించి ఉన్నత విద్యా శాఖ GO 209 జారీ చేసింది.
కోచింగ్ సెంటర్లలో అభ్యర్థుల మానసిక ఆరోగ్య రక్షణలను అమలులోకి తెచ్చే సమగ్ర నిబంధనలను ఈ కమిటీ రూపొందిస్తుంది. పదిహేను రోజుల్లో కమిటీ సిఫారసులతో నివేదికను ప్రభుత్వానికి పంపనుంది.
































