ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షలు, కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద..


యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీకి ఏపీ కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో.. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడుకి ఆరోగ్య బీమా కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించనున్నారు. ఇక ఈ యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్‌మెంట్ అందించనున్నారు.

ఇక పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడాలు లేకుండా అన్ని కుటుంబాలకూ ఈ యూనివర్సల్ హెల్త్‌ పాలసీని అమలు చేయాలని ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఏపీలోని 1.63 కోట్ల కుటుంబాలకు.. ఆరోగ్య బీమాను కల్పించేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణను తయారు చేసింది. ఈ నేపథ్యంలోనే 2,493 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా మెడికల్ ట్రీట్‌మెంట్ అందించేలా ఎన్టీఆర్‌ వైద్య సేవ హైబ్రిడ్‌ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,257 రకాల ట్రీట్‌మెంట్‌లను హైబ్రిడ్‌ పద్దతిలో ఉచితంగా ప్రజలకు అందించనున్నారు.

మరోవైపు.. ట్రీట్‌మెంట్ కోసం వచ్చేవారికి వీలైనంత త్వరగా అప్రూవల్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. అప్లై చేసుకున్న 6 గంటల్లోనే ట్రీట్‌మెంట్‌కు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్‌మెంట్‌ కోసం చర్యలు చేపట్టారు. రూ.2.5 లక్షలలోపు ఉన్న ట్రీట్‌మెంట్‌లకు సంబంధించిన క్లెయిమ్‌లు.. ఇన్సూరెన్స్‌ కంపెనీల పరిధిలోకి వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఇక రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లించనుంది. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.43 కోట్ల పేద కుటుంబాలతోపాటు.. 20 లక్షల మంది మధ్య తరగతి, ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని వర్తింపజేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.

ఇక.. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో ఆంధ్రప్రదేశ్‌లో 10 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం కల్పించింది. ఈ 10 కాలేజీలను ఒకే దశలో కాకుండా రెండు దశల్లో నిర్మించనున్నారు. మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె, పెనుగొండ, పాలకొల్లు, బాపట్ల, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.