రేషన్ పంపిణీ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులను ముందుగానే ఇళ్లకు పంపించాలని నిర్ణయించింది.
జులై నెల రేషన్‌ను నేటి నుంచి (జూన్ 26) ప్రారంభించి నాలుగు రోజుల్లో అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి, రేషన్ షాపుల ద్వారా పంపిణీని అమలు చేస్తోంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాపుల్లో సరుకులు అందిస్తున్నారు. అయితే, వృద్ధులు, దివ్యాంగుల కోసం మాత్రం ఇంటి వద్దకే సరుకులు చేర్చే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే, జూన్ నెలలో సమాచార లోపం కారణంగా పలువురు వృద్ధులు, దివ్యాంగులు స్వయంగా డిపోలకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనల నేపథ్యంలో, జూలై రేషన్ సరుకులను ముందుగానే ఇంటికి చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీకి వాహనాలను కాకుండా, డీలర్లే బాధ్యత వహించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చింది.
గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ చేశారు. ఇకపై కూడా సమయానికి, అవగాహనతో రేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ చర్యతో వృద్ధులు, దివ్యాంగులు డిపోల వద్ద రద్దీ నివారించుకోవడంతోపాటు, వారికి అవసరమైన సరుకులు సమయానుసారంగా అందే అవకాశం ఉంది.
































