మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట – బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

www.mannamweb.com


మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakirshna Reddy) భారీ ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు షరతులు విధించింది. రూ.50 వేలు విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని.. పాస్ పోర్ట్ అప్పగించాలని తెలిపింది. అలాగే, ప్రతీ వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం చేయాలని ఆదేశించింది. కాగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున పాల్వాయిగేట్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసులపై దాడి కేసులో ఆయన అరెస్టై.. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. జూన్ 26 నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.

అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం ఎట్టకేలకు పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నెల్లూరులోని కేంద్ర కారాగారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.