రేపట్నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్ధులకు సైతం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు కూటమి సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. శనివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవాడ పాయకాపురం కళాశాల నుంచి ప్రారంభం కానుంది..

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు జీవో విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో ఎంఎస్ నెంబర్ 40ను జారీ చేశారు. దీంతో రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు రంగం సిద్ధమవుతుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం (జనవరి 4) విజయవాడ పాయకాపురం కళాశాల నుంచి ప్రారంభించనున్న విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత భోజన పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ పథకం అమలుకు రూ. 29. 39 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. మొత్తం 11,028 మంది ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి మరో రూ. 85.84కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. ఈ పథకం అమలుకు ఇంటర్ విద్య డైరెక్టర్, మధ్యహ్న భోజన కార్యక్రమం డైరెక్టర్‌లు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులతో పాటు మధ్యాహ్న భోజన గైడ్ లైన్స్ ను వెల్లడించింది.

దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తిస్తుందని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. మధ్యహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహరం అందించడంతో పాటు ఆరోగ్యం, అన్ని విధాల అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందడంతో పాటు హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు.