AP Land Titling Act: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుకు సిద్ధం..

www.mannamweb.com


AP Land Titling Act: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుకు సిద్ధం.. చంద్రబాబు రెండో సంతకం దానిపైనే..
అమరావతి: రాష్ట్ర ప్రజలను భయకంపితులను చేసిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022) రద్దు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెండో సంతకాన్ని భూ హక్కు చట్టం రద్దు దస్త్రంపైనే పెట్టనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు రెవెన్యూశాఖ నుంచి ప్రభుత్వానికి అందాయి. దీనిని న్యాయశాఖ వద్దకు పంపబోతున్నారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల అనంతరం చంద్రబాబు ఈ దస్త్రంపై సంతకం చేసిన తర్వాత.. చట్టం రద్దుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత జరిగే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో టైటిలింగ్‌ చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెడతారు.

నీతీ ఆయోగ్‌ నమూనా చట్టానికి తూట్లు పొడిచి..
గత వైకాపా ప్రభుత్వం రూపొందించిన టైటిలింగ్‌ చట్టంలో పేర్కొన్న నిబంధనలు ప్రజల స్థిరాస్తుల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. సొంత స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కులను నిర్ణయించే అధికారాన్ని అధికారులకు అప్పగించి, యాజమాన్య హక్కుల కల్పన బాధ్యతల నుంచి సివిల్‌ కోర్టులను వైకాపా ప్రభుత్వం తప్పించడం దుమారాన్ని రేపింది. వైకాపా ప్రభుత్వం 2023 అక్టోబర్‌ 31 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ జీవో జారీచేయడం భూ యజమానులకు ఆందోళన కలిగించింది. అలాగే..చట్టంలోని సెక్షన్‌- 28కి అనుగుణంగా ఏపీ ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ దానికి ఛైర్‌పర్సన్, కమిషనర్, సభ్యులను నియమిస్తూ గతేడాది డిసెంబర్‌ 29న ప్రభుత్వం జీవో జారీచేసింది. నీతీ ఆయోగ్‌ ప్రతిపాదించిన టైటిలింగ్‌ చట్టానికి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడిచి.. తన ఇష్టమొచ్చినట్లు నియమ నిబంధనలు రూపొందించి, అందరిని కలవరానికి గురిచేసింది. నీతీ ఆయోగ్‌ ప్రతిపాదించిన ‘నమూనా టైటిలింగ్‌ చట్టం’ సెక్షన్‌-5లో టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(టీఆర్‌ఓ) నియామకం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్‌ జారీచేయడం ద్వారా ఏ అధికారినైనా (ఎనీ ఆఫీసర్‌) టీఆర్‌వోగా నియమించవచ్చని తెలిపింది. అయితే.. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం సెక్షన్‌ 5లో ‘ఏ వ్యక్తినైనా(ఎనీ పర్సన్‌)టీఆర్‌ఓగా నియమించవచ్చని పేర్కొంది. రికార్డుల్లో యజమానుల పేర్లను ఓ సారి చేర్చి నోటిఫై చేసిన తర్వాత మూడేళ్లలోపు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విషయంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించాలని నమూనా చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర చట్టంలో మూడేళ్ల కాలాన్ని రెండేళ్లకు కుదించారు. రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తం చేసే గడువును రెండేళ్లకే పరిమితం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే నీతీ ఆయోగ్‌ నమూనా చట్టం సెక్షన్‌ 16 ప్రకారం హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం హైకోర్టులో అప్పీల్‌కు అవకాశం ఇవ్వలేదు. హైకోర్టులో రివిజన్‌కు మాత్రమే దాఖలు చేసుకోవాలని పేర్కొన్నారు. భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికార పరిధి నుంచి రాష్ట్రంలోని సివిల్‌ కోర్టులను పూర్తిగా పక్కనపెట్టిన(సెక్షన్‌ 38) జగన్‌ సర్కారు.. హైకోర్టులో అప్పీల్‌కు అవకాశం లేకుండా కేవలం రివిజన్‌కు అవకాశాన్నికల్పించడం తీవ్రఆందోళన కలిగించింది.

న్యాయస్థానాల తీర్పులనూ పక్కనబెట్టి..
భూ యాజమాన్య హక్కు వివాదాన్ని పరిష్కరించేందుకు నీతీఆయోగ్‌.. నమూనా టైటిలింగ్‌ చట్టం ద్వారా మూడు అంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ద్వారా ఈ వ్యవహారాన్ని రెండు అంచెలకే పరిమితం చేశారు. న్యాయశాస్త్ర పరిజ్ఞానం లేని అధికారుల చేతుల్లో భూ యాజమాన్య హక్కులను నిర్ణయించే అధికారాన్ని వైకాపా ప్రభుత్వం కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. భూ హక్కులను అధికారులు నిర్ణయించలేరని, న్యాయస్థానాలు మాత్రమే ఈ విషయాన్ని పరిష్కరించగలవని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం పెడచెవినపెట్టింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నెలల తరబడి కోర్టు విధులను బహిష్కరించినా ప్రభుత్వం స్పందించలేదు.