ఏపీలో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. మద్యం ధరలను సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 15 శాతం మేర మద్యం ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్లు…ఇలా మూడు కేటగిరీల్లో మద్యం సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్ మద్యం పాలసీ ప్రకారం అమ్మకాలపై దుకాణదారులకు 14.5 శాతం మార్జిన్ చేస్తున్నారు.
ఈ మార్జిన్ సరిపోవడంలేదని దుకాణదారులు ఆందోళన చేయడంతో…కమిషన్ 14.5 నుంచి 20 శాతం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో అన్ని కేటగిరీల్లో మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన చేసింది. అయితే రూ.99కు అమ్మే బ్రాండ్, బీరు మినహా ఇతర అన్ని కేటగిరీల్లో మద్యం ధరలు పెంచారు.
15 శాతం మేర పెంపు
2019-24 ఎక్సైజ్ విధానాలను కూటమి ప్రభుత్వం సమీక్షించింది. లిక్కర్ పాలసీకి సంబంధించి వే ఫార్వర్డ్‌ను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. మద్యం ధరలు, రిటైల్ వాణిజ్యం, పన్నులపై కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కేబినెట్ సబ్ కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది. రిటైల్ వ్యాపారం, మద్యం ధరలు, పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో… తాజాగా మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
లిక్కర్ ధరలు పెంపుపై అసత్య ప్రచారం జరుగుతోందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మద్యం ధర రూ.15, రూ.20 పెరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, కానీ ధర 10 రూపాయలే పెరిగిందన్నారు. బ్రాండ్, సైజ్‌తో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 మాత్రమే పెంచినట్లు పేర్కొ్న్నారు. రూ.99 మద్యం, బీరు ధరల్లో ఎలాంటి పెంపు లేదన్నారు. ధరలను మద్యం షాపులను ప్రదర్శించాలని ఆదేశించినట్లు తెలియజేశారు.
ఏపీలో మద్యం దుకాణదారులకు చెల్లిస్తున్నమార్జిన్ చాలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కమిషన్ పెంపునకు ప్రభుత్వం అమోదం తెలిపిన విషయం తెలిసిందే. 2023-24లో దాదాపు రూ.36 వేల కోట్ల రుపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా లభించింది. ఇందులో డిస్టిలరీలకు చెల్లించిన డబ్బుతో పాటు ఉద్యోగుల జీతాలకు పోగా రూ.28-30వేల కోట్ల రుపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
ప్రైవేట్ మద్యం పాలసీ
ఏపీలో గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపింది. ఏపీలో ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని ఇచ్చే మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని సూచించినా ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుకు మొగ్గు చూపింది. గత ఏడాది అక్టోబర్ 16 నుంచి ఏపీలో 3వేలకు పైగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి.
మద్యం దుకాణాల్లో విక్రయాలకు 20 శాతం కమిషన్ లభిస్తుందని ప్రచారం చేయడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. లాటరీ విధానంలో షాపులు కేటాయించారు. అయితే మద్యం వ్యాపారాలన్నీ ఆయా నియోజక వర్గాల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేళ్ల మీద లెక్కించదగ్గ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారాలకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
క్రమంలో లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులకు తగిన విధంగా లాభాలు రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్‌లో కమిషన్ పెంచకపోతే అమ్మకాలు నిలిపివేస్తామని చెప్పడంతో.. ప్రభుత్వం మార్జిన్ ను 20 శాతానికి పెంచింది. కమీషన్ పెంపునకు అనుగుణంగా మద్యం ధరలను పెంచింది.