AP Mega DSC: ఏపీలో డిసెంబరులోగా ఉపాధ్యాయ నియామకాలు.. త్వరలో ప్రకటన

అమరావతి: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం ఆ దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి 16,347 భర్తీ చేయనున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన వెలువడనుంది. వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు అరకొరగా 6,100 పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి.. కొత్తగా 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. గత డీఎస్సీ ప్రకటనను అనుసరించి, దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయక్కర్లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. 2019 ఎన్నికల ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్‌ ఐదేళ్లలో ఆ ఊసే ఎత్తలేదు. 2024 ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. దానికి 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నా ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడింది.


10 వేలకు పైగా పోస్టులు అదనం
వైకాపా ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల కంటే 10 వేలకు పైగా అదనపు పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే.. ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. డీఎస్సీ ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వమే నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించింది.

తెదేపా హయాంలోనే డీఎస్సీలు
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా హయాంలోనే డీఎస్సీలు నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు రెండు డీఎస్సీలను తెదేపా ప్రభుత్వం నిర్వహించింది. డీఎస్సీ- 2014లో 10,313 పోస్టులు భర్తీ చేశారు. డీఎస్సీ-2019లో 7,902 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చి, ఎంపిక ప్రక్రియ చేపట్టారు. కోర్టు కేసుల కారణంగా నియామకాలు పెండింగ్‌లో పడ్డాయి. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత వాటి నియామకాలు పూర్తి చేశారు. ఈసారి బాధ్యతలు చేపట్టగానే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. డీఎస్సీ-2024లో 16,347 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇది కూడా పూర్తయితే తెదేపా హాయాంలో ప్రభుత్వ బడుల్లో 34,562 పోస్టులను భర్తీ చేసినట్లవుతుంది.