AP News: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు

AP News: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు
AP News: Arogyasree, EHS services to stop in AP


అమరావతి: ఆరోగ్యశ్రీ (Arogyashri) , ఈహెచ్ఎస్ (EHS) కింద అందించే సేవలను ఈనెల 22నుంచి రాష్ట్రంలో నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మి షాకు స్పెషాలిటీ ఆస్పత్రుల అసోషియేషన్ లేఖ రాసింది. తాము మే 2వ తేదీన సేవలు నిలిపి వేస్తామని ప్రకటిస్తే కేవలం రూ. 50 కోట్లు మాత్రమే ఈహెచ్ఎస్ కింద చెల్లించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద నయాపైసా కూడా చెల్లించలేదని అన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.1500 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

ఈ బకాయిలు చెల్లించాలని చాలా సార్లు కోరినప్పటికీ ఉపయోగం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాసేపటి క్రితం లేఖ కాపీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల కమిషన్ సీఈవో, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపామని యాజమాన్యాల సంఘం పేర్కొంది. ఈహెచ్‌ఎస్‌ బిల్లులూ (EHS Bills) బకాయిలున్నాయని, ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్పత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. బిల్లుల పెండింగ్‌తో ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని.. ట్రస్ట్‌ బకాయిపడ్డ రూ.1,500 కోట్లను వెంటనే చెల్లించి, సమస్యల పరిష్కారానికి సహకరించాలని స్పెషాలిటీ ఆస్పత్రుల అసోషియేషన్ కోరింది.