AP News: ఏపీ అసెంబ్లీలో ఏబీఎన్‌పై నిషేధం ఎత్తివేత..

www.mannamweb.com


అక్రమాలను, అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై(ABN Andhra Jyothy) గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని.. కొత్త ప్రభుత్వం తొలగించింది.

ఏబీఎన్‌తో పాటు మరో రెండు ఛానల్స్‌పై గత అసెంబ్లీ విధించిన నిషేధాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu) తొలగించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పైనే అయ్యన్న తొలి సంతకం చేశారు. అసెంబ్లీలో స్పీకర్‌ ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అయ్యన్నపాత్రుడు సభాపతిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం తొలి సంతకం.. ఆయా ఛానల్స్‌పై విధించిన నిషేధాన్ని తొలగిస్తూ రూపొందించిన ఫైల్‌పై పెట్టారు.

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఏబీఎన్‌ సహా మరికొన్ని ఛానల్స్‌కి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను కొట్టేస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలి సంతకం చేశారు. ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధులు సభలోకి రావొద్దనే పిచ్చి నిర్ణయం ఎవరు తీసుకున్నారంటూ అసెంబ్లీ కార్యదర్శిని నిలదీశారు స్పీకర్ అయ్యన్న. అంతకు ముందు ఏబీఎన్‌పై ఉన్న ఆంక్షలు తొలగించాలంటూ టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. ఈ లేఖను పరిశీలించిన స్పీకర్.. తక్షణమే ఆంక్షలు సడలిస్తూ తొలిసంతకం చేశారు.