AP Politics : రాజీనామాలకు చెక్.. బీజేపీలో వైసీపీ విలీనం

ఏపీ( Andhra Pradesh) విషయంలో బిజెపి సరికొత్త ఆలోచన చేస్తోంది. ఇప్పటివరకు వైసీపీ నేతల చేరిక విషయంలో అనేక రకాల నిబంధనలు ఉండేవి. అయితే అటువంటివేవీ లేకుండా బిజెపి వైసిపి నేతలను చేర్చుకునే పనిలో పడినట్లు ప్రచారం నడుస్తోంది.


ముఖ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత అందరి చూపు బిజెపి వైపు ఉంది. బిజెపి ఆడిన గేమ్ లో భాగంగానే విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారన్నది ప్రతి ఒక్కరికి అర్థం అయ్యింది. అయితే రాజ్యసభకు చాలామంది వైసిపి నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే వారు రాజీనామా కంటే మరో పార్టీలో చేరడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు బిజెపి ప్లాన్ మారుస్తోంది. ఏపీలో కూటమి పార్టీలతో పని లేకుండా తన బలాన్ని పెంచుకునే పనిలో పడింది.

* కూటమి పార్టీల మధ్య పంపకం
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, కృష్ణయ్యలు రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు. అందులో రెండు పదవులను టిడిపి తీసుకుంది. ఒక పదవి బిజెపికి విడిచిపెట్టింది. ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని సైతం మూడు పార్టీలు కోరుకుంటున్నాయి. అయితే రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవడం బిజెపికి అవసరం. కానీ వైసీపీకి రాజీనామా చేసిన వారి విషయంలో మిగతా రెండు కూటమి పార్టీలు తమ ప్రయోజనాలను కోరుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు బిజెపి కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది.

* అప్పట్లో టిడిపి రాజ్యసభ సభ్యులు అలానే
2019 ఎన్నికల్లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ఓడిపోయింది. కానీ అప్పట్లో రాజ్యసభలో ఆ పార్టీకి ఐదుగురు సభ్యులు ఉండేవారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ తో పాటు మరొకరు బిజెపిలో చేరిపోయారు. తమ పార్టీ రాజ్యసభ పక్షాన్ని బిజెపిలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో టిడిపిలో కనకమెడల రవీంద్రబాబు మాత్రమే ఉండిపోయారు. ఇప్పుడు అలానే వైసిపి రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకుంటే మంచిది అని బిజెపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైసిపి నేతల రాజీనామాతో.. ఖాళీ అవుతున్న స్థానాలు కూటమిలో రెండు పార్టీలు తీసుకుంటున్నాయి. అదే విలీన ప్రక్రియతో అయితే బిజెపికి సింహభాగం ప్రయోజనాలు దక్కుతాయి. ఇప్పుడు ఆ ఆలోచనతోనే బిజెపి కొత్త గేమ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

* నేరుగా విలీనం
వైసీపీకి ( YSR Congress)ప్రస్తుతం ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో ముగ్గురు నుంచి నలుగురు వరకు పార్టీ మారుతారని ప్రచారంలో ఉంది. అయితే వారు పదవులకు రాజీనామా చేసేందుకు ఇష్టపడడం లేదు. తమ పదవులకు డోకా లేకుండా చూస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారి.. రాజీనామా చేసి.. తిరిగి అదే కూటమి పార్టీల నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనా పర్వాలేదు అంటున్నారు. కానీ బిజెపి దీనిని ఇష్టపడడం లేదు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మొత్తం నేరుగా బిజెపిలో చేరితే.. ఎటువంటి ఇబ్బందులు రావని ఆలోచన చేస్తోంది. రాజ్యసభలో వైసీపీ పక్షాన్ని బిజెపిలో విలీనం చేయాలని భావిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.