వారికి పదోన్నతులు కల్పించి దాదాపు దశాబ్దం అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రమోషన్ల ఊసే లేదు. అడిగినా పట్టించుకునే వారే లేరు. దీంతో ఆ టీచర్లు నిరాశ చెందారు. అయితే.. తాజాగా వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రమోషన్లు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పురపాలక ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పురపాలక స్కూళ్ల నిర్వహణ బాధ్యతను 2022 జూన్‌లో ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు అప్పగించింది. ఈ విభాగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2017 నుంచి ప్రమోషన్లు కల్పించలేదు. పంచాయతీ రాజ్, ప్రభుత్వ విభాగంలోని ఉపాధ్యాయులకు సర్దుబాటు పేరుతో ప్రమోషన్లు ఇచ్చారు. కానీ.. పురపాలక టీచర్లకు మాత్రం కల్పించలేదు. వీరి సర్వీసు నిబంధన వేరుగా ఉండటంతో సాధ్యం కాలేదని అధికారులు చెబుతున్నారు.
అటు ఒక శాఖ నుంచి మరో శాఖకు రావడంతో తమను పట్టించుకోవడం లేదని పురపాలక ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటుకు పంచాయతీ రాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో జీవో నంబర్ 117ను అమలు చేశారు. పురపాలక స్కూళ్లలో మాత్రం అనధికారికంగా అమలు చేశారు. దీంతో ప్రమోషన్లు లేక పురపాలక ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీరికి ప్రత్యేకంగా ఎంఈవో, డీఈవో, డైరెక్టర్ వంటి వ్యవస్థ లేదు. పంచాయతీ రాజ్, ప్రభుత్వ విభాగంలోని అధికారులే వీరిని పర్యవేక్షిస్తున్నారు.
పదోన్నతుల్లో మెరిట్, రిజర్వేషన్లు పాటించాలని పురపాలక ఉపాధ్యాయులు కోరుతున్నారు. పురపాలక స్కూళ్లలో ప్రవేశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో టీచర్ల కొరత కూడా ఉంది. ఇటీవల సర్దుబాటు చేసినప్పుడు ఇతర స్కూళ్ల టీచర్లను ఈ పాఠశాలలకు పంపించారు. ఈ నేపథ్యంలో.. తమకు ప్రమోషన్లు కల్పించాలని పురపాలక ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వంతో మాట్లాడి.. పదోన్నతులు కల్పిస్తామని ఉపాధ్యాయ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు.
21 మంది బదిలీ..
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా విద్యా శాఖ అధికారులు బదిలీ అయ్యారు. 21 జిల్లాలకు సంబంధించి విద్యా శాఖ అధికారులను బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. మరోవైపు ఉపాధ్యాయ బదిలీలు ప్రక్రియ నిలిచిపోయింది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. ఇంకా ఆ ప్రక్రియను చేపట్టలేదు. ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయ బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.