ప్రతి విద్యార్థికి ‘అపార్’ కార్డు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది. కార్డుపై క్యూఆర్ కోడ్‌తో పాటు 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. అపార్‌తో ఎక్కడి నుంచైనా ప్రవేశాలు పొందవచ్చు.
విద్యార్థులకు కొత్త కార్డులు రానున్నాయి. ఆధార్ కార్డు తరహాలోనే విద్యార్థకులకు కూడా ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఆపార్) కార్డులు రానున్నాయి. నూతన విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికి అపార్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో తొమ్మిది, పదో తరగతులు చదువుకుంటున్న విద్యార్థులకు ఈ కార్డులు జారీ చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
వన్ నేషన్-వన్ స్టూడెంట్ నినాదంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ అపార్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది. ఒక విద్యార్థికి వచ్చిన గుర్తింపు సంఖ్య, మరో విద్యార్థికి రాదు. ప్రస్తుతం ఆధార్ కార్డులకు కూడా ఇదే తరహాలోనే ఉన్నాయి. దేశంలో ఒక వ్యక్తికి ఉన్న ఆధార్ నెంబర్ మరొ వ్యక్తికి ఉండదు. సరిగ్గా ఇదే తరహాలో విద్యార్థులకు కూడా గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు.
కార్డులో ఏ వివరాలు ఉంటాయి ?
అపార్ కార్డులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, క్యూఆర్ కోడ్, 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మాత్రం విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, క్యూఆర్ కోడ్, 12 అంకెల గుర్తింపు సంఖ్యతో పాటు ఆ విద్యార్థి మార్కులు, గ్రేడ్లు, ఉపకార వేతనాల వివరాలు, అవార్డులు, డిగ్రీలు, క్రీడలు, ఇతర అంశాల్లో సాధించిన విజయాలతో పాటు విద్యా సంబంధింత వివరాలతో సమగ్ర రికార్డును అందుబాటులో ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానికి మొత్తం వివరాలను తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులకు ఉపయోగపడుతోంది.
తొలుత ఈ తరగతుల విద్యార్థులకే…!
తొలుత తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఈ కార్డులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు యూడైస్ వెబ్‌సైట్లో పెన్ (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్) ఉంది. దీని ఆధారంగానే విద్యార్థులకు ప్రవేశాలు, టీసీలు జారీ చేస్తున్నారు. ఇదే తరహాలోనే ఇకపై అపార్‌తో అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తారు.
ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో తొమ్మిది, పదో తరగతులు చదువుకుంటున్న విద్యార్థులకు ఈ కార్డులు జారీ చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేశారు. అలాగే వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర విద్యా శాఖ నిర్వహణలో ఈ అధికారిక వెబ్‌సైట్ https://apaar.education.gov.in/ అందుబాటులోకి వచ్చింది.
అపార్‌తో ఎక్కడి నుంచైనా ప్రవేశాలు పొంద వచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు సంఖ్య ఆధారంగా అపార్ కార్డులో విద్యార్థి బ్యాంకు ఖాతా నంబర్, డీజీ లాకర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ కార్డులను జారీ చేసే ముందు కేంద్ర ప్రభుత్వం అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ)ని ప్రారంభించింది. డీజీ లాకర్ ద్వారా వివరాలు నమోదు చేస్తే విద్యార్థి పేరుతో సహా ఆపార్ కార్డు వస్తుంది. దీన్ని నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిద్వారా వివిధ విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల్లో వివరాల నమోదు, ధ్రువీకరణ తదితర పనులన్నీ సులువుగా పూర్తి అవుతాయి. స్కాలర్ షిప్స్ మంజూరు, ఉద్యోగాల భర్తీ, ఇతర సందర్భాల్లో ఇదే కీలకం కానుంది.
మరోవైపు అపార్ డేటా భద్రత, గోప్యతకు ప్రాధ్యాత ఇస్తుంది. గోప్యత, భద్రత కోసం అవసరమైన ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే సమాచారాన్ని పంచుకుంటుంది. సమాచారంపై విద్యార్థులకు నియంత్రణ ఉండలా చేస్తుంది.