రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో కూటమి ప్రభుత్వం నూతన ఉత్సాహాన్ని, ఆశలను నింపిందని ఏపీ నాన్ గజిటెడ్, గజిటెడ్ ఉద్యోగుల సంఘం(ఏపీఎన్‌జీజీవో) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.
శివారెడ్డి, ఎ. విద్యాసాగర్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం ఏపీఎన్‌జీజీవో రాష్ట్ర కార్యవర్గం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎంపికైన సాగర్‌ను చంద్రబాబు అభినందించారు. ఆ తర్వాత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రాన్ని అందించారు. ఉద్యోగుల పెండింగ్ డీఏలతో పాటు జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెండ్ లీవ్ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పొడిగించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 2004, సెప్టెంబరు 1కి ముందు నోటిఫికేషన్ మేరకు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో ఏపీఎన్‌జీజీవో నాయకులు కేఎ్‌సఎస్ ప్రసాద్, ఎన్. వెంకటేశ్వర్లు, సీహెచ్ మంజుల, అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు.
పలు డైరీల ఆవిష్కరణ
ఏపీజేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాలైన రెవెన్యూ, కో ఆపరేటివ్, ఆర్టీసీ, రిటైర్డ్ హెడ్మాస్టర్ల సంఘాల డైరీలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలోని వివిధ భాగస్వామ్య సంఘాల నేతలు బుధవారం చంద్ర బాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రికి అందజేశారు. 11వ పీఆర్సీలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, 12వ పీఆర్సీ కమిషనర్‌ను వీలైనంత త్వరగా నియమించాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో టీవీ ఫణి పేర్రాజు, దామోదరరావు, కె. సంగీతరావు, పీవీ రమణ, జనకుల శ్రీనివాసరావు, వీవీ మురళీకృష్ణ నాయుడు, నాగరాజు, పాలె లక్ష్మీ, పొన్నూరు విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. అదేవిధంగా ఏపీపీటీడీ ఎన్‌ఎంయూ సంఘం క్యాలండర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. బుధవారం ఏపీపీటీడీ అగ్రనేతలు పీవీ రమణారెడ్డి, కోశాధికారి పీవీవీ మోహన్‌లు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
పాత పింఛను ఇవ్వండి: సీపీఎ్‌సఈఏ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులలో భరోసా నింపేలా పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం(ఏపీసీపీఎ్‌సఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కరిమి రాజేశ్వరరావులు బుధవారం ఓ ప్రకటనలో ముఖ్యమంత్రిని కోరారు. గత పీఆర్‌సీ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల హెల్త్‌కార్డు కంటే కూడా ఆరోగ్య శ్రీ కార్డులు బాగా పనిచేస్తున్నాయని, తక్షణం నగదు రహిత హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు.