డీఎస్సీ అభ్యర్థులకు 25న నియామకపత్రాలు

డీఎస్సీ-2025కు ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 25న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ చేతుల మీదుగా నియామకపత్రాలు అందజేస్తారని డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు.


ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపికై న అభ్యర్థులు, వారికి తోడుగా వచ్చే సహాయకుల కోసం మొత్తం 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 24న తెల్లవారుజామున 5 గంటలలోపు అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాల వద్దకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు, వారి సహాయకులు ఆధార్‌కార్డు, బెడ్‌షీటు, తలదిండు, గొడుగు, స్వెటర్‌ తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఇదివరకే ఎంట్రన్స్‌ ఐడీ కార్డులు తీసుకున్న అభ్యర్థులు, సహాయకులు తప్పనిసరిగా వాటని వెంట తెచ్చుకోవాలని డీఈఓ సూచించారు.

సెపక్‌తక్రా పోటీల రన్నర్‌ అనంత

ఉరవకొండ: రాష్ట్రస్థాయి సెపక్‌ తక్రా పోటీల ఓవరాల్‌ విజేతగా కృష్ణా జిల్లా బాలబాలికల జట్లు నిలిచాయి. ఆతిథ్య అనంతపురం జిల్లా జట్లు రన్నర్‌తో సరిపెట్టుకున్నాయి. ఉరవకొండలోని జెడ్పీ సెంట్రల్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 21 నుంచి జరుగుతున్న 28వ సబ్‌ జూనియర్‌ రాష్ట్రస్థాయి సెపక్‌ తక్రా పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి సబ్‌ జూనియర్‌ బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. అనంతపురం, కృష్ణా జిల్లాల బాలబాలికల జట్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో కృష్ణా జిల్లాకు చెందిన బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ సభలో ముఖ్య అతిథిగా భారతదేశ సెపక్‌తక్రా క్రీడల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, జిల్లా చైర్మన్‌ సప్తగిరి మల్లి, కార్యదర్శి షాహిన్‌, ఎస్‌కెఆర్‌సీ క్లబ్‌ ఉపాధ్యక్షులు ఎర్రిస్వామినాయుడు, ఆమిద్యాల రాజశేఖర్‌ హాజరయ్యారు. గెలుపోటములను సమానంగా స్వీకరించినపుడే క్రీడల్లో రాణిస్తారని వక్తలు తెలిపారు. అనంతరం విన్నర్స్‌, రన్నర్స్‌ జట్లకు పతకాలు, కప్‌లు, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో సీనియర్‌ పీడీలు మారుతిప్రసాద్‌, పుల్లా రాఘవేంద్ర, నాగరాజు, ప్రభాకర్‌, మంజునాథ్‌, జనార్దన్‌, శివకుమార్‌, రాయుడు, కృష్ణ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

అదనపు కట్నం కోసం

పోలీసు వేధింపులు

రాప్తాడురూరల్‌: అదనపు కట్నం కోసం వేధించేవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. అలాంటి పోలీసులే వేధిస్తే ఎవరికి చెప్పుకోవాలి? అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరానికి చెందిన సూర్యనారాయణ, ఉరవకొండ ప్రాంత వాసి గాయత్రికి పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. వీరి కుటుంబం అనంతపురం రూరల్‌ పాపంపేటలో నివాసం ఉంటోంది. సూర్యనారాయణ కళ్యాణదుర్గం టౌన్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చారు. ఇటీవల అదనపు కట్నంపై ఆశపుట్టిన సూర్యనారాయణ తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పెద్దలు ఎన్నిమార్లు సర్దిచెప్పినా ఆయనలో మార్పు రాలేదు. సోమవారం భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయాలపాలైన బాధితురాలు సర్వజన ఆస్పత్రిలో చేరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్‌సీసీ కేడెట్స్‌ అరుదైన ఘనత

● దేశంలో ఆరో స్థానంలో జేఎన్‌టీయూ (ఏ)

అనంతపురం: జేఎన్‌టీయూ (అనంతపురం) ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ కేడెట్స్‌ అరుదైన ఘనత సాధించారు. ఎన్‌సీసీ క్యాడెట్స్‌ సీనియర్‌ అండర్‌ ఆఫీసర్‌ (ఎస్‌యూఓ) కె.ప్రణతి (కంప్యూటర్స్‌ సైన్స్‌ విభాగం), కేడెట్‌ కేఎం అఖిల (సివిల్‌), బి.సౌజన్య (ఈసీఈ), పి.నఫియా (ఈఈఈ) ఏపీ, తెలంగాణ డైరెక్టరేట్‌ తరఫున ఈ నెల 1 నుంచి 12 వరకు నిర్వహించిన ఆల్‌ ఇండియా థల్‌ సైనిక్‌ క్యాంప్‌లో పాల్గొన్నారు. 70 రోజుల పాటు బ్రాహ్మణపల్లి, అనంతపురంలో నిర్వహించిన ఏడు ఎంపిక శిబిరాల్లో కఠినమైన శిక్షణలో నిష్ణాతులైన వారిని ఈ క్యాంప్‌కు ఎంపిక చేశారు. వీరిలో ప్రతిభ, సౌజన్య జడ్జింగ్‌ డిస్టెన్స్‌, ఫీల్డ్‌ సిగ్నల్స్‌ విభాగంలో, అఖిల, నఫియా మ్యాప్‌ రీడింగ్‌లో ప్రతిభ ప్రదర్శించి సత్తా చాటారు. ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌లో దేశవ్యాప్తంగా ఆరో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌.సుదర్శనరావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.కృష్ణయ్య, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.చెన్నారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.వసుంధర, ఎన్‌సీసీ ఆఫీసర్‌ కెప్టెన్‌ డాక్టర్‌ శారద అభినందించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.