ఆంధ్రప్రదేశ్‌లో 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు సచివాలయంలో జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్‌ఐపీబీ సమావేశంలో చర్చించారు.
దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టుల్లో 9 కీలక ప్రాజెక్టుల స్థాపనకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఈ 9 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 2,63,411కుపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్ 6 వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా దాదాపు 2,400 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో ఈ రిఫైనరీ ఏర్పాటు కానుంది. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ.88వేల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
విశాఖ మిలీనియం టవర్స్‌లో రూ.80 కోట్ల పెట్టుబడితో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా దాదాపు 2వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అనకాపల్లి జిల్లాలో 106 ఎకరాల్లో రూ.1174 కోట్ల పెట్టుబడితో మరో సంస్థతో పాటు ఇంధన రంగానికి చెందిన పలు సంస్థల ప్రాజెక్టులకు సైతం సీఎం ఆమోదం తెలిపారు. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా పలు సంస్థలు దాదాపు రూ.83 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.4వేల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2028నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.