రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. కీలకమైన 150 గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో 866 ఖాళీలను ఈ ఏడాదిలో భర్తీ చేయనుంది.
2,686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు
పాతవి, కొత్తవి అన్నీ కలిపి ఈ ఏడాది భర్తీ
1,016 పోస్టులకు కొత్తగా 19 నోటిఫికేషన్లు
ఇప్పటికే జారీ చేసిన వాటిలో 1,670 పోస్టులు
వీటిలో కీలకమైన 150 గ్రూప్-1 ఉద్యోగాలు
12న జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం
వర్సిటీలు, ఆర్జీయూకేటీల్లో 3 వేలకు పైగా ఖాళీలు
వాటినీ ఈ ఏడాదే భర్తీ చేయనున్న ప్రభుత్వం
రాష్ట్రంలో సర్కారీ కొలువుల జాతరకు రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిపికేషన్ల భర్తీ ప్రక్రియను పూర్తిచేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్లు కూడా ఇచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 12న జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. కీలకమైన 150 గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో 866 ఖాళీలను ఈ ఏడాదిలో భర్తీ చేయనుంది. దీనికోసం కొత్తగా 19 నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో హడావుడిగా నోటిఫికేషన్లు జారీచేసినా వాటి భర్తీ ప్రక్రియను మాత్రం పూర్తిచేయలేకపోయింది. నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూసే గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా, దాన్నీ పూర్తిచేయలేదు. అదేవిధంగా ఇతర శాఖల్లోనూ అనేక నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయింది. దీంతో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు పాతవాటిని పూర్తిచేయడం ప్రస్తుతం ఏపీపీఎస్సీకి పెద్ద బాధ్యతగా మారింది.
ఈ పోస్టులకు కొత్త నోటిఫికేషన్లు
జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్-7, ఇంటర్ విద్యలో లైబ్రేరియన్ సైన్స్ జూనియర్ లెక్చరర్- 2, మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్-11, అగ్రికల్చర్ ఆఫీసర్-10, హార్టికల్చర్ ఆఫీసర్-2, ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్-3, గ్రౌండ్ వాటర్ టెక్నికల్ అసిస్టెంట్-4, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్-100, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్-256, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్-435, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటిజన్ శాఖలో గ్రేడ్-1 వార్డెన్-1, దేవదాయశాఖ ఈవో-7, మైన్స్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్-1, ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్-1, ఫారెస్ట్ తానేదార్-10, ఫారెస్ట్ గ్రేడ్-2 డ్రాఫ్ట్స్‌మెన్- 13, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్-1, జైళ్ల శాఖ జూనియర్ అసిస్టెంట్-1, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్-1 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనంతరం ఈ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేయడానికి సిద్ధమైంది.
పాత నోటిఫికేషన్ల వివరాలివీ..
2023లో ఏపీపీఎస్సీ అనేక నోటిఫికేషన్లు జారీ చేసింది. ఐదేళ్లలో ఒక్క గ్రూప్-2 పోస్టు భర్తీచేయని జగన్ ప్రభుత్వం ఎన్నికల వేళ నిరుద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా 987 పోస్టులకు గతేడాది జూలైలో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయించింది. అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు 38, పీసీబీలో సహాయ పర్యావరణ అధికారి పోస్టులు 21, పీసీబీలో గ్రేడ్-2 అనలిస్ట్ పోస్టులు 18, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు 37, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ 20, మెయిన్స్ జరగాల్సిన గ్రూప్-1 పోస్టులు 89, పాలిటెక్నికల్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు 99, ఇంటర్ విద్యలో జూనియర్ లెక్చరర్లు 47, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు 290, ఇతర శాఖల్లో మరికొన్ని పోస్టులున్నాయి.
జూన్ నాటికి పూర్తయ్యేలా షెడ్యూలు
ఇప్పటికే జారీచేసిన నోటిఫికేషన్లను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని ఏపీపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23న జరుగుతుంది. డీవైఈవో పోస్టులు, పర్యావరణ ఇంజనీర్ పోస్టుల పరీక్షలు మార్చిలో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష ఏప్రిల్ 15న, ఎన్టీఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఏప్రిల్ 16న, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మే నెలలో, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షలు జూన్‌లో నిర్వహించేలా షెడ్యూలు రూపొందించింది. అలాగే కొత్త నోటిఫికేషన్లను జూలై నుంచి డిసెంబరు నాటికి పూర్తిచేయనుంది. అయితే త్వరలో విడుదల చేసే డీఎస్సీ పరీక్షల తేదీలు, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకేసారి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మిగిలిన ఉద్యోగాలపైనా కసరత్తు
ఇప్పటికే ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేసేందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంది. షెడ్యూలు ప్రకారం ఇప్పటికే జారీ కావాల్సి ఉండగా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రక్రియ ఆగింది. వర్గీకరణ కసరత్తు పూర్తయిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే యూనివర్సిటీలు, ఆర్జీయూకేటీల్లో 3వేలకు పైగా ఖాళీలను కూడా ఈ ఏడాదే భర్తీ చేసే అవకాశం ఉంది.